ఐదు రోజులే గడువు..ఆ తర్వాత చెత్తబుట్టలోకే ఆ నోట్లు
X
సెప్టెంబర్ 30తో రూ.2వేల నోటు మార్పిడి గడువు ముగియనుంది. మరో ఐదు రోజులు మాత్రమే ఈ పెద్ద నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉంది. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఆర్బీఐ రూ.2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 23 నుంచి అన్ని బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం ఇచ్చింది. ఒకవేళ ఆ నోట్లను ఇప్పటికీ మార్చుకోనట్లైతే వెంటనే ఆ పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ గడువులోపు ఈ నోట్ల మార్పిడి జరగకపోతే ఆ నోట్లు చెల్లుబాటు కావు. పెద్ద నోట్లను చెత్తబుట్టలో పడేయాల్సిందే.
ఒక రోజులో గరిష్టంగా 20 వేల వరకు రూ.2వేల నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. ఏ బ్యాంకులో అయినా ఇదే పరిమితి వర్తిస్తుంది. అయితే సాధారణ సేవింగ్స్ అకౌంట్లు, జన్‌ధన్ అకౌంట్లల్లో మాత్రం ఆర్బీఐ డిపాజిట్లకు ఏవిధమైన పరిమితిని విధించలేదు. అయితే రూ.50 వేలకు పైన అమౌంట్‌ను డిపాజిట్ చేయాల్సి వస్తే మాత్రం పాన్ డీటెయిల్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది . రూ.2వేల నోట్ల మార్పిడికి ఎలాంటి పత్రం అవసరం లేదు. కానీ, కొన్ని బ్యాంకులకు మాత్రం ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి వస్తుందని ఆర్బీఐ తెలిపింది. అయితే సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు అంటే ఇంకా నోట్ల మార్పిడికి 5 రోజులు మాత్రమే గడువు ఉంది. అయితే ఈ ఐదురోజుల్లో ఒక రోజు బ్యాంకులకు సెలవు. అంటే 25, 26, 27 తేదీల్లో నోట్లు మార్పిడి చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. మళ్లీ 28న మిలాద్-ఉన్-నబి కావడంతో బ్యాంకులు హాలిడే. మళ్లీ 29, 30 తేదీల్లో బ్యాంకులు వర్క్ చేస్తాయి. ఈ తేదీల్లో బ్యాంక్ సమయంలో మాత్రమే రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. ఒకవేళ గడువు ముగిసినా నోట్లు మార్పిడి చేసుకోకపోతే ఇక అవి చెల్లుబాటు కానట్లే. వాటిని చెత్తబుట్టల్లో పడేయాల్సిందే.