లక్ష్యాన్ని చేరుకోలేకపోయానని బ్యాంక్ మేనేజర్ ఆత్మహత్య
X
ఉన్నత చదువు.. బ్యాంకులో మంచి ఉద్యోగం.. ఎలాంటి ఇబ్బందుల్లేని కుటుంబం.. ఇవన్నీ ఉన్నా కూడా ఓ మహిళా ఉద్యోగి తొందరపాటుతో తప్పుడు నిర్ణయం తీసుకుంది. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోలేదనే బాధతో ప్రాణాలు తీసుకుంది. బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. కర్ణాటకలోని మండ్యాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చామరాజనగర్ జిల్లా కొల్లేగల్‌కు చెందిన మల్లప్ప కుమార్తె శృతి.. కావేరీ గ్రామీణ బ్యాంక్ (ప్రస్తుతం కర్ణాటక గ్రామీణ బ్యాంక్)లో అధికారిగా పనిచేస్తుంది. చిక్కమగళూరు బ్రాంచ్‌లోని ఏడేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న శృతి.. కొన్ని నెలల నుంచి మండ్యాలోని ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే మండ్యాలోని వినాయక లేఅవుట్‌లోని అద్దె ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటుంది.
ఐఏఎస్ అధికారిణి కాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శృతి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శృతి.. తన తండ్రికి ఫోన్ చేసి, తన జీవితాన్ని ముగించుకుంటున్నట్లు తెలియజేసింది. కాల్‌ను డిస్‌కనెక్ట్ చేసే ముందు క్షమించమని కోరింది. దీంతో షాక్‌కు గురైన శృతి తండ్రి.. వెంటనే ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో వెంటనే మండ్యాలోని తన బంధువులకు సమాచారం అందించాడు. అయితే శృతి అప్పటికే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. శృతి రాసిన సూసైడ్ నోట్‌లో ఐఏఎస్ అధికారి కాలేకపోయినందుకు తీవ్ర నిరాశే కారణమని రాసి ఉంచినట్లు మండ్యా ఎస్పీ యతీష్ ఎన్ తెలిపారు. ఇందుకు సంబంధించి మండ్యా రూరల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.