Home > జాతీయం > భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు క్రూరత్వమే: హైకోర్టు

భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు క్రూరత్వమే: హైకోర్టు

భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు క్రూరత్వమే: హైకోర్టు
X

భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు వరకట్న వేధింపులు లేదా అత్యాచార ఆరోపణలు చేయడం చాలా క్రూరమైనదని, క్షమించరానిదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏ వివాహ బంధానికైనా కలసి జీవించడమే ముఖ్యమని, జంట ఏ ఒక్కరు విడిపోవాలని భావించినా ఆ బంధం ముందుకు సాగదని పేర్కొంది. భర్త కుటుంబ సభ్యులపై ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘‘కేవలం వర్నకట్న వేధింపులే కాదు.. భర్త కుటుంబ సభ్యులపై అత్యాచార ఆరోపణలు కూడా ఈ కేసులో తప్పుగా తేలాయి. ఇది తీవ్రమైన క్రూరత్వం. దీనికి క్షమాపణ లేదు’’ అని తెలిపింది. భర్తకు అనుకూలంగా కుటుంబ న్యాయస్థానం జారీ చేసిన విడాకుల డిక్రీని సవాల్‌ చేస్తూ ఓ మహిళ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.





మొదట ఫ్యామిలీ కోర్టులో విడాకుల డిక్రీకి సంబంధించి భర్తకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో వాది- ప్రతివాదులకు 2012లో వివాహమైంది. 2014 నుంచి విడిగా ఉంటున్నారు. అయితే దూరంగా ఉంటూ భర్త కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ జంట గత తొమ్మిదేళ్ల నుంచి దూరంగా ఉంటున్నారు. ఈ మహిళ దూరంగా ఉంటున్న భర్తపై తప్పుడు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల ఆరోపణలు చేయడంతో పాటు అతడి కుటుంబ సభ్యులపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఇవన్నీ అబద్ధమని తేలింది. ఇది క్షమార్హం కాదు’’ అని జస్టిస్‌ సురేశ్‌ కుమార్‌ కైత్‌, జస్టిస్‌ నీనా బన్సాల్‌ కృష్ణా వ్యాఖ్యానించారు. ‘‘ఏ వివాహ బంధానికైనా మూలాధారం సహజీవనం, దాంపత్య సంబంధమే. ఒకరితో ఒకరు సహవాసం చేయనప్పుడు ఆ వివాహ మనుగడ కష్టమని స్పష్టంగా రుజువవుతుంది. తొమ్మిదేళ్లు ఒకరికొకరు దూరంగా ఉండటం తీవ్రమైన మానసిక క్రూరత్వమే. హిందూ వివాహ చట్టంలోని క్రూరత్వం నిబంధన.. ఇలాంటి బంధాన్ని తక్షణం విడదీయాలని చెబుతోంది’’ అని హైకోర్టు పేర్కొంది. ఈ అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యక్తపరిచిందని తెలిపింది.




Updated : 4 Sept 2023 9:09 AM IST
Tags:    
Next Story
Share it
Top