Home > జాతీయం > ఢిల్లీలో ఉద్రిక్తత .. 200 మంది రైతులు అరెస్ట్

ఢిల్లీలో ఉద్రిక్తత .. 200 మంది రైతులు అరెస్ట్

ఢిల్లీలో ఉద్రిక్తత .. 200 మంది రైతులు అరెస్ట్
X

రైతుల ఆందోళనతో ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీకి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. వందలాది మంది రైతులు నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద నుంచి పార్లమెంటు ముట్టడికి బయల్దేరారు. పోలీసులు వారిని అడ్డుకును ప్రయత్నం చేశారు. అయితే రైతులు బారీకేడ్లను తొలగించి ముందుకు వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో 200 మంది రైతులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైతుల నిరసనల వల్ల ఢిల్లీలోని పలు హైవేలపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైతులు తమ కుటుంబాలకు మెరుగైన పునరావాస సౌకర్యాలను కల్పించాలని కోరారు. అలాగే భూ పరిహారాన్ని పెంచాలని నోయిడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 81 గ్రామాలకు చెందిన భూముల్లో ఈ నోయిడా అథారిటీ అనేది ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్ కోసం 1997 నుంచి 2014 వరకూ భూములను సర్కార్ సేకరించింది.

అయితే 16 గ్రామాల రైతులకు మాత్రమే పరిహారాన్ని అందించింది. దీంతో మిగిలిన గ్రామాల రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రైతుల డిమాండ్లను పరిశీలించాలని నోయిడా అథారిటీని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ రైతులకు పూర్తి న్యాయం ఇంత వరకూ జరగలేదు. దీంతో రైతులు రోడ్డునపడ్డారు. తమకు సరైన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో రైతుల నిరసనలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపై వాహనాలు బారులు తీరాయి.


Updated : 8 Feb 2024 12:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top