Home > జాతీయం > Cm Siddaramaiah : రైతుని పెళ్లి చేసుకునే యువతికి రూ.5 లక్షలు ఇవ్వాలి.. రైతు సంఘాలు

Cm Siddaramaiah : రైతుని పెళ్లి చేసుకునే యువతికి రూ.5 లక్షలు ఇవ్వాలి.. రైతు సంఘాలు

Cm Siddaramaiah : రైతుని పెళ్లి చేసుకునే యువతికి రూ.5 లక్షలు ఇవ్వాలి.. రైతు సంఘాలు
X

చెప్పుకోవడానికి, వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా.. పెళ్లిళ్ల విషయంలో రైతు సంఘాలు సాక్షాత్తూ ముఖ్యమంత్రి వద్ద ఏకరవు పెట్టడం భిన్న ఆలోచనలు రేకెత్తిస్తోంది. తమ ప్రాంతాల్లోని రైతులకు 45 ఏండ్లు నిండుతున్నా పెళ్లిళ్లు కావట్లేదని, దేశానికే వెన్నెముకగా అభివర్ణించే రైతు.. కనీసం పెళ్లి చేసుకునేందుకు కూడా అర్హత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టాన్నే నమ్ముకొని, ఏటా రూ.లక్షల ఆదాయాన్ని గడిస్తున్నా రైతులకు వివాహం కావడం లేదని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘాల ప్రతినిధులు ఆ రాష్ట్ర సీఎం వద్ద ఆక్రోశించారు. రైతు యువకుడ్ని పెళ్లి చేసుకునే యువతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సీఎ: సిద్ధరామయ్యను కోరారు.

బడ్జెట్లో సేద్యానికి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు నిధుల కేటాయింపునకు సంబంధించి రైతు సంఘాలకు చెందిన 218 మంది రైతులతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం భేటీ అయ్యారు. కరవు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల రుణమాఫీ ఇవ్వాలని రైతు సంఘాల నాయకుడు బడగలపుర నాగేంద్ర కోరారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో రైతులను పెళ్లాడేందుకు ఏ ఒక్కరూ ముందుకు రావడంలేదని, ఫలితంగా రైతు ఒంటరి బతుకు గడపాల్సి వస్తుందని చెప్పారు. జీవితంలో ప్రతీ ఒక్కరికి తోడు ఉండాలని చెబుతూనే.. రైతును చేసుకోబోయే యవతికి రూ.5 లక్షల ప్రోత్సాహాన్ని అందించేలా వచ్చే బడ్జెట్ లో నిధులివ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.

కాగా గతేడాది జరిగిన ఎన్నికల ప్రచార సమయంలో మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి రైతు పుత్రులను పెళ్లి చేసుకున్న యువతులకు రూ.2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా రావడంతో ఈ హమీ అమలు కాలేదు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత, సీఎం సిద్ధరామయ్యకు తమ సమస్యలను విన్నవించారు. ఇది మాత్రమే కాకుండా తక్కువ ధరలో వ్యవసాయ రుణాలు, బీజేపీ గతంలో తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం, నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువుల అభివృద్ధి, మండ్య షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, కొత్తగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్తు కనెక్షన్‌ తీసుకునేందుకు వచ్చే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరించడం, తదితరాలతో కూడిన వినతిపత్రాలను ముఖ్యమంత్రికి అందజేశారు.




Updated : 12 Feb 2024 4:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top