Delhi : ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చిన రైతులు..పోలీసుల హై అలర్ట్!
X
సమస్యలు పరిష్కరించాలంటూ అన్నదాతలు రొడ్డెక్కారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ..ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో హరియాణా, ఢిల్లీ పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఎల్లుండి దాదాపు 200 రైతు సంఘాలు ‘ చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై రావద్దని హరియాణా పోలీసులు సూచించారు. అంబాల, సోనిపట్, పంచకుల్ ప్రాంతాల్లో సెక్షన్ 144ను విధించారు. పోలీసు శాఖ సూచనలన ప్రకారం.. ప్రజలు తమ టూర్స్ ప్లాన్ చేసుకోవాలని కోరారు. అంతేగాక 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి. పంజాబ్, హరియాణా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఒక వేళ రైతులు నగరంలోకి రావాలని యత్నిస్తే..వెంటనే సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు.
పంటకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా వంటివి కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే.. హరియాణాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దాలెవాల్. సరిహద్దులు మూసేసి...144వ సెక్షన్ విధించారని తెలిపారు. ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారని..అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా..? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవని తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టిపెట్టాలని సూచించారు.