Home > జాతీయం > Farmers’ protest: బుల్లెట్‌ తగిలి యువ రైతు దుర్మరణం.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు బ్రేక్..!!

Farmers’ protest: బుల్లెట్‌ తగిలి యువ రైతు దుర్మరణం.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు బ్రేక్..!!

Farmers’ protest: బుల్లెట్‌ తగిలి యువ రైతు దుర్మరణం..  ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు బ్రేక్..!!
X

పంటకు కనీస మద్దతు ధర కోరుతూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతన్నలపై పోలీసులు రబ్బరు బుల్లెట్లను పేల్చారు. సౌండ్ కెనాన్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. బుధవారం జరిగిన ఈ ఉద్రిక్త ఘటనల మధ్య ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయాడని, 160 మందికిపైగా అన్నదాతలు గాయపడ్డారని రైతు సంఘం నేతలు వెల్లడించారు. పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని ఖానౌరి వద్ద ఈ విషాదం చోటు చేసుకోగా.. మృతుడిని 21 ఏళ్ల శుభ్‌కరణ్‌ సింగ్‌గా గుర్తించారు. పంజాబ్‌లోని భటిండా జిల్లా బాలోక్‌ గ్రామానికి చెందిన శుభ్‌కరణ్‌ను చికిత్స కోసం పాటియాలలోని రాజింద్రా హాస్పిటల్‌కు తరలించగా.. తల మీద తీవ్రమైన గాయంతో అప్పటికే ఆయన మరణించారని, బుల్లెట్‌ తగలటం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ హెచ్‌ఎస్‌ రేఖి తెలిపారు. శవపరీక్షలో మిగిలిన వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.

పోలీసు సిబ్బంది, రైతుల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో చనిపోయిన శుభకరన్ సింగ్ (21) మృతికి సంయుక్త్ కిసాన్ మోర్చా(SKM) సంతాపం తెలిపింది. ప్రస్తుత సంక్షోభం మరియు ప్రాణనష్టానికి కేంద్రమే బాధ్యత వహించాలని ఆరోపించింది. అయితే మరణించిన రైతు రబ్బర్ బుల్లెట్‌ తగలటం వల్ల ప్రాణాలు కోల్పోయారా అనేది స్పష్టం కాలేదు. ఈ ఘటన నేపథ్యంలో రైతు నేతలు ఛలో ఢిల్లీ ఉద్యమానికి రెండు రోజుల విరామం ప్రకటించారు. ఈ రోజు, రేపు మిగతా రైతు సంఘాల నేతలతో చర్చించి, శుక్రవారం సాయంత్రం తమ భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. అప్పటి వరకూ పంజాబ్‌-హరియాణా సరిహద్దులోని శంభు, ఖానౌరీ ప్రాంతాల్లో మోహరించిన దాదాపు 14 వేల మందికిపైగా రైతులు అక్కడే ఉంటారని చెప్పారు. కాగా, బుధవారం రైతులతో జరిగిన ఘర్షణలో 13 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని హరియాణాకు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు. రబ్బర్ బుల్లెట్ల కారణంగా ఎవరూ చనిపోలేదని చెబుతున్నారు.

Updated : 22 Feb 2024 3:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top