Odisha train accident: మార్చురీలో కొడుకు.. చేయి కదలడంతో హాస్పిటల్కు.. ఆ తర్వాత
X
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైలు ప్రమాదంలో 275 మంది చనిపోగా.. 11వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఓ అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. రెస్క్యూ టీం చేసిన పొరపాటు నుంచి నిండు ప్రాణం బలైపోయేది. కానీ, ఓ తండ్రి నమ్మకం.. ఆ ప్రాణాన్ని కాపాడుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హేలారామ్ మాలిక్ తన కొడుకు బిస్వజిత్ మాలిక్ (24 ఏళ్లు)ను షాలిమార్ స్టేషన్లో కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఎక్కించాడు. ప్రయాణం మొదలైన కొద్దసేపటికి.. రైలు ప్రమాదం జరిగిందనే వార్త హేలారామ్కు తెలిసింది. ప్రమాదంలో చాలామంది చనిపోయారు అనే వార్త విని చలించిపోయాడు. కానీ, తన కొడుకుకు ఏమీ అయిండదని బలంగా నమ్మాడు.
అంతే.. వెంటనే స్థానిక అంబులెన్స్ తీసుకుని 230 కిలోమీటర్లు ప్రయాణించి బాలాసోర్ చేరుకున్నాడు. అక్కడున్న హాస్పిటల్స్ అన్నీ తిరిగినా.. ఎక్కడా కొడుకు జాడ కనిపించలేదు. అయినా.. తన నమ్మకాన్ని వదులుకోలేదు. కొడుకు ప్రాణాలతోనే ఉంటాడని బలంగా నమ్మాడు. చివరగా మిగిలిన మార్చురీకి వెళ్లి వెతకగా.. అక్కడ షాలిమార్ కొడుకు కనిపించాడు. అది చూసి తట్టుకోలేని షాలిమార్.. కొడుకు బిస్వజిత్ శరీరంపై పడి ఏడ్చాడు. అంతలో.. బిస్వజిత్ చేయి చిన్నగా కదిలింది. అది గమనించిన షాలిమార్ పల్స్ చెక్ చేయగా.. బిస్వజిత్ హార్ట్ కొట్టుకుంటుంది.
వెంటనే తనతో వచ్చిన అంబులెన్స్ డ్రైవర్ సాయం తీసుకుని.. బిస్వజిత్ను హాస్పిటల్కు తరలించాడు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కోల్కతాకు తీసుకెళ్లాడు. బిస్వజిత్ పరిస్థితి విషమంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతనికి చీలమండ ఆపరేషన్ జరిగింది. దీనిపై స్పందించిన అధికారులు.. ఆపస్మారక స్థితిలో ఉన్న బిస్వజిత్ను చనిపోయాడనుకుని.. మార్చురీకి తరలించి ఉంటారన్నారు. ఏదైతేనేం.. ఓ తండ్రి ప్రేమ, నమ్మకం.. కొడుకు ప్రాణం పోకుండా కాపాడగలిగింది.