Home > జాతీయం > ఇవాళ జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ

ఇవాళ జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ

ఇవాళ జమిలి ఎన్నికల కమిటీ తొలి భేటీ
X

మోదీ ప్రభుత్వం జమిలి ఎన్నికల దిశగా దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరీ, గులాంనబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారిలను సభ్యులుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి ఈ కమిటీలో సభ్యుడిగా ఉండేందుకు నిరాకరిస్తూ అమిత్ షాకు లేఖ రాశారు. కాగా ఇవాళ ఈ కమిటీ తొలి సమావేశం జరగనుంది.

ఈ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలు, రాజకీయ పార్టీలు, సంబంధిత నిపుణులతో చర్చలు, ఇతర విషయాల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై చర్చించనుంది. ఈ కమిటీ ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం కోసం అవసరమయ్యే సవరణలు, నియమాలను పరిశీలించి కేంద్రానికి సిఫారసు చేస్తుంది. హంగ్ హౌస్, అవిశ్వాస తీర్మానం ఆమోదించడం లేదా ఫిరాయింపులు వంటి పరిస్థితులకు సాధ్యమైన పరిష్కారాలను కూడా కమిటీ విశ్లేషించి సిఫారసు చేయనుంది.

రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరమా అని కూడా ఇది పరిశీలించి సిఫారసు చేస్తుంది.ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే వన్ నేషన్ - వన్ ఎలక్షన్’’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు.. మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే కేంద్రం ప్రవేశపెట్టింది. కమిటీకి స్వపక్ష నేతే సారథ్యం వహిస్తుండడంతో నివేదిక జమిలి ఎన్నికలకు అనుకూలంగానే వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


Updated : 23 Sep 2023 2:22 AM GMT
Tags:    
Next Story
Share it
Top