Former Governor Satyapal : జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ ఇంట్లో సీబీఐ దాడులు..
X
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటితో సహా 30 పైగా చోట్ల సీబీఐ దాడులు నిర్వహిస్తోంది. యూటీకి కిరు జల విద్యుత్ ప్రాజెక్ట్ కాంట్రాక్టుకు సంబంధించి అవినీతి ఆరోపణాలపై దాడులు జరుగుతున్నాయి. 2018, 2019లో జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్, ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లకు క్లియర్ చేయడానికి రూ.300 కోట్ల లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. గురువారం ఉదయం ఢిల్లీతోపాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన 30 చోట్ల దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది అధికారులు పాల్గొన్నారు. ఆయన గవర్నర్‌గా ఉన్న కాలంలో రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు (HEP) నిర్మాణపనులకు సంబంధించిన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ వ్యవహారంపై 2022, ఏప్రిల్ నెలలో సత్యపాల్ మాలిక్ సహా ఐదుగురిపై సీబీఐ కేసు నమోదుచేసింది. 2018, ఆగస్టు 23 నుంచి 2019, అక్టోబర్ 30 వరకు ఆయన జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా, సీబీఐ సోదాలపై సత్యపాల్ స్పందించారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ.. తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సోదాల ద్వారా తన డ్రైవర్, సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారని విమర్శించారు. దాడులకు తాను భయపడేది లేదని, రైతుల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఈ చర్యలు తనను నిలువరించలేవని సామాజిక వేదిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా చెప్పారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఓ హాస్పీటల్‌లో చికిత్స పొందుతున్నారు.