Ashok Chavan: కాంగ్రెస్‌కు మరో షాక్.. పార్టీకి గుడ్‌బై చెప్పిన అశోక్ చవాన్
X
లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ (Ashok Chavan) ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. భోకర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ చవాన్...స్పీకర్‌కి తన రాజీనామా లేఖని సమర్పించారు. ఆదివారం స్పీకర్ రాహుల్‌తో చవాన్ సమావేశం అయ్యారు. రాహుల్ పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. త్వరలో రాజ్య సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో చవాన్ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చవాన్ బీజేపీలో చేరతారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని ప్రచారం జరుగుతోంది
ఆయన బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కి ఇది రెండోషాక్ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దియోర గత నెల పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఏక్‌నాథ్ శిందే వర్గమైన శివసేనలో చేరారు. ఆ తరవాత మరో నేత బాబా సిద్దిఖీ పార్టీకి రాజీనామా చేసి అజిత్ పవార్ వర్గంలో చేరారు. నిజానికి చాలా రోజులుగా అశోక్ చవాన్ బీజేపీలో చేరతారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ పనితీరుపై చౌహాన్ అసంతృప్తితో ఉన్నారు.