Mahua Moitra: మహువా మొయిత్రాకు షాకిచ్చిన కోర్టు.. దెబ్బకు బంగ్లా ఖాళీ
X
తృణమూల్ కాంగ్రెస్ నేత, లోక్‌సభ బహిష్కృత ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra).. ఎట్టకేలకు ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక బంగ్లాను మహువా శుక్రవారం ఖాళీ చేశారు. టీఎంసీ ఎంపీగా ఉన్న మహువాకు ఢిల్లీలో ఓ ప్రభుత్వ బంగ్లాను కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, గతేడాది మహువా మొయిత్రా లోక్‌సభ (Lok Sabha) సభ్యత్వం రద్దైన నేపథ్యంలో.. బంగ్లాను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై స్టే ఇచ్చేందుకు దిల్లీ హైకోర్టు గురువారం నిరాకరించింది. ఈ క్రమంలోనే శుక్రవారం బంగ్లా ఖాళీ చేయించేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DoE) విభాగ అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. నేరుగా ఆమెను ప్రభుత్వ బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలోనే తాజాగా మహువా ప్రభుత్వ బంగ్లాను వీడినట్లు సంబంధిత వర్గాల సమాచారం.
గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన టీఎంసీ నేత మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే జనవరి 7 తేదీ లోగా ఇంటిని ఖాళీ చేయాలని ఆమెకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో మళ్లీ జనవరి 8వ తేదీన ఎస్టేట్స్ శాఖ నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇంత వరకు బంగ్లాను ఖాళీ చేయలేదని ప్రశ్నించింది. జనవరి 12వ తేదీ కూడా మరో నోటీసు ఇచ్చింది. ఆ తర్వాత జనవరి 17వ తారీఖున మరోసారి నోటీసులు జారీ అయ్యాయి. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు, ఖరీదైన కానుకలు తీసుకున్నారని, పార్లమెంట్ లాగిన్‌ను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా అనైతిక ప్రవర్తన, సభా ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా తన పార్లమెంట్ లాగిన్ వివరాలను బయటి వ్యక్తులకు ఇచ్చినట్లు తేల్చింది. ఈ నివేదికకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. దాంతో ఆమె లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసి.. సభ నుంచి బహిష్కరించారు.