గ్రీస్ తీరంలో విషాదం.. కార్గో షిప్ మునిగి 13 మంది గల్లంతు
X
గ్రీస్ తీరంలో విషాదం చోటు చేసుకుంది. కార్గో షిప్ మునిగిపోయిన ఘటనలో 13మంది గల్లంతయ్యారు. బలమైన గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకరిని రక్షించారు. నౌక మునిగిన సమయంలో అందులో 14 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 8 మంది ఈజిప్టుకు చెందినవారుకాగా.. నలుగురు భారతీయులు, ఇద్దరు సిరియాకు చెందిన వారున్నారు.
ఈజిప్టులోకి అలెగ్జాండ్రియా నుంచి 6వేల టన్నుల ఉప్పుతో కార్గో షిప్ ఇస్తాంబుల్కు బయలుదేరింది. ఆదివారం ఉదయం 7గంటల సమయంలో ఓడలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన సిబ్బంది ఆ విషయాన్ని దగ్గరలోని సెంటర్ కు సంకేతాలు పంపారు. ఆ తర్వాత కాసేపటికే షిప్ కనిపించకుండా పోయినట్లు కోస్ట్ గార్డ్స్ వెల్లడించారు.
కార్గో షిప్ లోని సిబ్బంది ఆచూకీ కోసం రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది గాలింపు ముమ్మరం చేశారు. 8 నౌకలు, 2 హెలికాప్టర్లతో పాటు ఓ యుద్ద నౌక గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. ఈ ఘటనలో రెస్క్యూ సిబ్బంది ఒకరిని రక్షించగా 13 మంది గల్లంతయ్యారు. సముద్రంలో భీకర గాలులు వీస్తుండటంతో గాలింపు కష్టంగా మారింది.