Home > జాతీయం > మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. 9 మంది మృతి

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. 9 మంది మృతి

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. 9 మంది మృతి
X

మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య వైరంతో అట్టుడుకుతున్న రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. ఈస్ట్ ఇంఫాల్ లోని ఖమెన్ లాక్ ప్రాంతంలో మంగళవారం రాత్రి చెలరేగిన హింసలో ఓ మహిళ సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకున్నాయి.

ఇంఫాల్ ఈస్ట్ సరిహద్దు జిల్లాలోని ఖమెలాక్ ప్రాంతంలోని గ్రామస్థులను మిలిటెంట్లు మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చుట్టుముట్టారు. అనంతరం అత్యాధునిక ఆయుధాలతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఈస్ట్ ఇంఫాల్ ఎస్పీ శివకాంత్ సింగ్ చెప్పారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని పోలీసులు వెంటనే హాస్పిటల్కు తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మెయిటీల ఆధిపత్యం కలిగిన ఇంఫాల్ ఈస్ట్ జిల్లాకు, గిరిజన మెజారిటీ ఉన్న కాంగ్పోక్తి జిల్లాకు సరిహద్దుల్లో ఖమెలాక్ ప్రాంతం ఉంది. తాజా కాల్పుల ఘటనతో పోలీసులు తిరిగి కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం మణిపూర్‌లోని 16గానూ 11 జిల్లాల్లో కర్ఫూ అమల్లో ఉంది. హింసాత్మక ఘటనలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీకాగా.. వీరిలో చాలా మంది ఇంఫాల్ వ్యాలీలో ఉంటున్నారు. గిరిజన జనాభా 40 శాతం ఉండగా, వారంతా కొండప్రాంత జిల్లాల్లో నివసిస్తున్నారు.

మెయిటీలకు ఎస్టీ హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో మే 3న మణిపూర్లో అల్లర్లు మొదలయ్యాయి. చురా చాంద్ పూర్, తదితర జిల్లాలో హింస చెలరేగి 115 మంది చనిపోయారు. 50,000 మందికిపైగా నిరాశ్రయులయ్యారు. మణిపూర్‌లో హింసాకాండ ఉద్ధృతం కావడంతో కేంద్ర బలగాలను మోహరించారు. మరోవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్వయంగా నాలుగు రోజుల పాటు మణిపూర్‌లో మకాం వేసి శాంతియత్నాలు సాగించారు.

Updated : 14 Jun 2023 3:07 PM IST
Tags:    
Next Story
Share it
Top