Home > జాతీయం > మహాత్మునికి నివాళులర్పించిన ప్రపంచ నేతలు

మహాత్మునికి నివాళులర్పించిన ప్రపంచ నేతలు

మహాత్మునికి నివాళులర్పించిన ప్రపంచ నేతలు
X

జీ 20 సదస్సులో భాగంగా ఆదివారం ప్రపంచ నేతలు మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఆదివారం ఉదయమే రాజ్‌ఘాట్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాల నేతలకు సాదరంగా స్వాగతం పలికారు. పలు దేశాల అధ్యక్షులు, ప్రతినిధులు రాజ్‌ఘాట్‌కు చేరుకున్న అనంతరం మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రార్థనలు నిర్వహించారు.

శాంతి, సేవ, కారుణ్యం, అహింసలకు మహాత్మా గాంధీ దిక్సూచి అని మోడీ అభిప్రాయపడ్డారు. సమ్మిళిత, సౌభాగ్యవంతమైన ప్రపంచ భవిష్యత్తు కోసం గాంధీజీ ఆదర్శాలు మార్గదర్శనం చేస్తాయని అన్నారు. రాజ్ ఘాట్ కు వచ్చిన ప్రపంచ నేతలంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం.

మహాత్ముడికి నివాళులు అర్పించిన అనంతరం ప్రపంచ దేశాల నాయకులంతా భారత్‌ మండపానికి చేరుకున్నారు. సౌత్‌ ప్లాజాలో మొక్కలు నాటారు. ఆ తర్వాత జీ20 మూడో సెషన్‌ అయిన ‘వన్‌ ఫ్యూచర్‌’ మొదలైంది. వచ్చే ఏడాదికి G20 ప్రెసిడెన్సీని బ్రెజిల్‌ చేపట్టనుంది. ఈ క్రమంలో భారత్ ఆ దేశానికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ప్రధాని మోదీ మధ్యాహ్నం పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్‌కు వర్కింగ్ లంచ్ ఇచ్చిన అనంతరం మోడీ కొమొరోస్, టర్కీ, యూఏఈ, దక్షిణ కొరియా, యురోపియన్ యూనియన్, బ్రెజిల్, నైజీరియా అధినేతలతో సమావేశమవుతారు. ఆయా దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆయా దేశాలతో కీలక అంశాలపై రంగాలవారీగా భారత్ పలు ఒప్పందాలు చేసుకోనుంది.


Updated : 10 Sept 2023 12:24 PM IST
Tags:    
Next Story
Share it
Top