Success story : అప్పుడు ఫీజు కోసం అప్పు చేశాడు.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు..!
X
సంపన్న కుటుంబంలో పుట్టలేదు. IIT, IIMలలో చదవలేదు. ఫీజు కట్టేందుకు పైసల్లేక అప్పులు చేశాడు. కష్టే ఫలి అని పెద్దలు చెప్పిన మాటను అక్షర సత్యం చేశాడు. కష్టాలు, కన్నీళ్లను అధిగమించి ఒక్కో మెట్టు పైకెక్కాడు. ప్రస్తుతం రూ. 95 వేల కోట్ల విలువైన కంపెనీకి అధిపతి అయ్యాడు. ఎందరికో రోల్ మోడల్గా నిలిచాడు. అతనే ఫ్రెష్ వర్క్స్ ఇన్కార్పొరేషన్ వ్యవస్థాపకుడు గిరీష్ మాతృభూతమ్.
ఫీజు కట్టలేక..
తమిళనాడు తిరుచ్చికి చెందిన ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు గిరీష్ మాతృభూతమ్. తండ్రి ప్రజాసేవకుడు, షణ్ముగ ఆర్ట్స్, సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసిన గిరీష్.. 1992లో ఐఐటీ ఎగ్జామ్ రాశాడు. కానీ క్వాలిఫై కాలేకపోయాడు. చివరకు మద్రాస్ యూనివర్సిటీలో ఎంబీఏ సీటు సంపాదించాడు. అప్పటికీ ఆయన ఇంట్లో ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే. ఫీజు కట్టేందుకు పైసా లేని పరిస్థితి. ఇంట్లో వాళ్లు చదువు ఆపేయమని అన్నారు. కానీ గిరీష్ మాత్రం పట్టు వదలలేదు. దీంతో తండ్రి ఓ బంధువు వద్ద అప్పు తెచ్చి ఎంబీఏలో జాయిన్ చేశాడు.
ఓటమితో పాఠాలు
తన చదువు కోసం తండ్రి పడ్డం కష్టం చూసిన గిరీష్కు అప్పుడే డబ్బు విలువ అర్థమైంది. ఎంబీఏ పూర్తైన వెంటనే డబ్బులు సంపాదన కోసం రకరకాల బిజినెస్లు చేశాడు. కానీ అవేవీ సక్సెస్ కాలేదు. ఓటమినే గుణపాఠాలుగా మార్చుకున్నాడు. కొన్నాళ్లు వ్యాపారాన్ని వదిలి ఉద్యోగంలో చేరాడు. అమెరికాలో హెచ్సీఎల్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. కోరుకున్నంత జీతం. విలాసవంతమైన జీవితం. అయినా తృప్తిలేదు. దీంతో గిరీష్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకున్నాడు.
ఉద్యోగం వదిలి
2010లో ఉద్యోగం వదిలేశాడు. స్నేహితుడైన షాన్ కృష్ణస్వామితో కలిసి చెన్నైలో ఫ్రెష్ వర్క్స్ అనే సాప్ట్ వేర్ కంపెనీ స్థాపించాడు. ఈసారి విజయం వరించింది. కంపెనీ పెట్టిన ఏడాదిలోనే పెట్టుబడి తిరిగొచ్చింది. ఆ తర్వాత గిరీష్ కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 2021 నాటికి కంపెనీ రెవెన్యూ 49 శాతం దాటింది. 300 మిలియన్ డాలర్లకు చేరింది.
వేల కోట్ల సామ్రాజ్యం
ఫ్రెష్ వర్క్స్ కంపెనీ తయారుచేసే సాప్ట్ వేర్ యూజర్ ఫ్రెండ్లీ ఉండటంతో ఊహించని రీతిలో క్లయింట్స్ పెరిగారు. కంపెనీ స్థాపించిన 8 ఏండ్లలోనే కంపెనీ ఆదాయం 100 మిలియన్ డాలర్లకు చేరగా.. ఆ తర్వాత ఏడాదిన్నరలోనే 200 మిలియన్ డాలర్ల మార్కు దాటింది. ప్రస్తుతం ఫ్రెష్ వర్క్స్ కంపెనీకి ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పారిస్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక ఆఫీసులున్నాయి. కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ కాలిఫోర్నియాలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీకి 50 వేల మంది క్లయింట్స్ ఉన్నారు. తమ సంస్థ రెవెన్యూ 95 వేల కోట్లు అని ఫ్రెష్ వర్క్స్ గర్వంగా చెప్పుకుంటుంది ఫ్రెష్ వర్క్స్. పట్టుదల ఉంటే సాధ్యం కాదని నిరూపించాడు మాతృభూతమ్.