Gold Price : భగ్గుమన్న బంగారం.. రూ. 65 వేలకు చేరుకోవచ్చు!
X
బంగారం ధరలు ఈ రోజు కూడా భగ్గుమన్నాయి. వెండి కూడా షాకిచ్చింది. వీటి ధరలు నెలానెలా గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణలు, పతనమవుతున్న అమెరికా డాలర్ విలువ, వడ్డీరేట్ల తగ్గుదల తదితర పరిణమాలు పసిడి ధరలకు మరింత ఆజ్యం పోసే అవకాశముంది. దసరా, దీపావళి సీజన్లలో ధరలకు ఊపొచ్చింది. క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలకు కూడా కలిసిరావడంతో ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 కేరట్ల పసిడి పది గ్రాములకు రూ. 250 పెరిగి రూ. 57,350కి చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 62,560కి చేరుకుంది. పెరుగుదల ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా మేలిమి పసిడి ధర రూ. 65 వేలు దాటిపోతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
మరోపక్క వెండి ధరలకు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 1,300 పెరిగి రూ. 81,500కు చేరింది. పెరుగుదల కొనసాగితే కేజీ ధర దీపావళి నాటికి రూ. రూ. 85 వేలకు చేరుతుందని అంచనా. శుభకార్యాలకు బంగారం కొసే తాహతు లేని ప్రజలు వెండితో సరిపోట్టుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు రజతం కూడా చుక్కలు తాకుతుండడంతో కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు.