అయ్యప్ప భక్తులకు శుభవార్త..ఇకపై ఎక్కడి నుంచైనా కానుకలు సమర్పించవచ్చు
X
శబరిమల ఆలయం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే తెరిచి ఉంటుంది. ఆ సమయంలోనే స్వామివారి దర్శించుకునేందకు పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వస్తుంటారు. అయ్యప్పను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి హుండీలో స్వామివారికి కానుకలు సమర్పిస్తుంటారు. అలా గత ఏడాది స్వామివారి హుండీకి రూ.330 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిని మరింత పెంచేందుకు గాను ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ 'ఇ-కానిక అనే ' వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వెబ్‌సైట్ ద్వారా అయ్యప్ప భక్తులు ప్రపంచంలో ఎక్కడినుండైనా శబరిమలకు కానుకలు సమర్పించవచ్చు.
ప్రముఖ సాంకేతిక దిగ్గజం టీసీఎస్ కంపెనీ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇకపై డిజిటల్ కరెన్సీ రూపంలో భక్తులు స్వామివారికి కానుకలు వేయవచ్చు. సుదార ప్రాంతాల్లో ఉండే భక్తులు తమ మొక్కులు చెల్లించేందుకు వీలుగా ట్రావెన్‌కోర్ దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం ఈ వెబ్‌సైట్ భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయ బోర్డు ప్రెసిడెంట్ అనంత గోపాలన్ ఇ-కానికలో మొదటి కానుకను సమర్పించారు. ఇప్పటికే వెబ్‌సైట్‌లో అయ్యప్పకు కానులు చేరుతున్నాయి. ఈ వెబ్‌సైట్ ద్వారా ఆలయ ఆదాయం మునుపటి కంటే బాగా పెరుగుతుందని ఆలయ బోర్డ్ అంచనా వేస్తోంది.
ఇక ఇదిలా ఉండగా, జూన్ 15న శబరిమల క్షేత్రాన్ని తెరిచి నాలుగురోజులపాటు అయ్యప్పకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నాలుగు రోజులు ఆలయానికి భక్తుల రాక అధికంగా ఉంటుంది. ఇప్పటికే ట్రావెన్‌కోర్ దేవస్థానం సభ్యులు స్వామివారిని వర్చువల్ దర్శించుకునే విధానాన్ని తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా టీసీఎస్ రూపొందించింది.
జులైలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.