కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఫ్లిప్‌కార్ట్
X
ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. సాధారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో ఏదైనా వస్తువును ఆర్డర్ చేస్తే అది ఇంటికి వచ్చేందుకు రోజుల తరబడి చూడాల్సి వచ్చేది. బుక్ చేసుకున్న వస్తువులు డోర్ డెలివరీ చేయడానికి వారి నుంచి పది రోజులు పట్టడం వల్ల కస్టమర్లు ఎదురుచూస్తూ ఉండేవారు. ఇకపై ఆ సమస్యలు ఉండవు. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్ తమ ప్లాట్‌ఫామ్‌లో బుక్ చేసిన వస్తువులను అదే రోజున డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఆర్డర్ బుక్ చేసిన రోజునే అది డోర్ డెలివరీ చేయబడుతుంది. అయితే ఈ సేవలు కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఈ సేవలు ప్రారంభమై ఆ తర్వాత క్రమంగా అంతటా వాడుకలోకి వస్తాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఇప్పటి వరకూ అమెజాన్ తమ కస్టమర్లకు అదే రోజు డెలివరీ సేవలను అందిస్తూ వచ్చేది. ఇకపై ఆ సేవలను ఫ్లిప్‌కార్ట్ కూడా అందించనుంది. ఫిబ్రవరి నెలలో దేశంలోని 20 నగరాల్లో ఈ సేవల్ని ప్రారంభించనున్నట్లుగా ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, కోయంబత్తూర్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్, జైపూర్, ఇండోర్, కోల్‌కతా, లక్నో, లూథియానా, ముంబై, నాగ్‌పూర్, పూణే, పాట్నా, రాయ్‌పూర్, సిలిగురి, విజయవాడలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
20 నగరాల్లో ఆర్డర్ చేసిన వస్తువులు అదే రోజు డెలివరీ కానున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. బుక్ చేసిన రోజే డెలివరీ కావడానికి మధ్యాహ్నం 1 గంటలోపు ఆర్డర్ చేయాల్సి ఉంటుందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. మధ్యాహ్నం 1 గంట తర్వాత బుక్ చేసిన ఆర్డర్లు మరుసటి రోజు డెలివరీ అవుతాయి. మొబైల్ ఫోన్లు, ఫ్యాషన్ వస్తువులు, పుస్తకాలు, హోమ్ అప్లికేషన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు సహా అనేక ఉత్పత్తులను అదే రోజు డోర్ డెలివరీ చేయనున్నట్లుగా ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది.