Home > జాతీయం > రూటు మార్చిన రైల్వే శాఖ..ఇకపై ప్రాంతాలను బట్టి వంటకాలు

రూటు మార్చిన రైల్వే శాఖ..ఇకపై ప్రాంతాలను బట్టి వంటకాలు

రూటు మార్చిన రైల్వే శాఖ..ఇకపై ప్రాంతాలను బట్టి వంటకాలు
X

వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తరువాత రైలులో సరఫరా చేసే ఆహారం రుచిగా లేదని, నాణ్యత కొరవడిందని రైల్వే శాఖకు చాలా ఫిర్యాదులు అందాయి. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రయాణికులు రైలులో అందించే ఆహారాన్ని ఫోటోలు తీసి షేర్ చేసి వారి ఆవేదనను, కోపాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఈ విషయాలను పరిశీలించిన రైల్వే శాఖ కేటరింగ్ సేవల్లో సమూల మార్పులను తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రయాణికులకు అందించే ఆహారం, పానీయాల సరఫరాలో ప్రాంతాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.




రైలులోనే క్యాటరింగ్ సేవలు ఉండటం వల్ల సాధారణంగా ప్రయాణికులు టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలోనే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. అయితే చాలా కాలంగా వారు మెచ్చే రుచికరమైన ఆహారం లభించడం లేదన్న ఫిర్యాదు ఐఆర్‎సీటీసీ మీద ఉంది. అందుకే ప్రయాణికులకు ఆహార, పానీయాల అందించేందుకు ఏర్పాటు చేసిన కేటరింగ్‌ సేవల్లో మార్పులకు శ్రీకారం చుట్టింది రైల్వేశాఖ . ఆయా ప్రాంతాల్లోని ప్రజలు మెచ్చే రుచులను, సీజన్‎కు అనుగుణంగా వంటకాలను ప్రయాణికులకు అందించేందుకు ఐఆర్‌సీటీసీకి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి తెలిపారు. గురువారం పార్లమెంటు సభ్యులతో మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.




ప్రతి రోజు సగటున 1.80 కోట్ల మంది ప్రజలు రైలు ప్రయాణం చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం రైళ్లలో, స్టేషన్లలో నాణ్యమైన ఆహారం అందించేందుకు ఈ సంస్కరణలు చేపట్టింది రైల్వే శాఖ. వివిధ ప్రాంతాల వారికి ఇష్టమైన ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇ-కేటరింగ్‌, డిజిటల్‌ చెల్లింపు విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజా నిర్ణయంతో ఇకపై రుచికరమైన ఆహారం లభిస్తుందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 2 Jun 2023 6:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top