ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం...సామాన్యుడికి ఊరట
X
దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. గత కొంతకాలంగా కూరగాయల నుంచి కూరలో వేసుకునే మసాలాల ధరలు ఆకాశనంటుతున్నాయి. కొండకెక్కిన టమాట ధర ఇప్పుడిప్పుడే కిందకు దిగుతుంటే...ఈసారి ఉల్లి వంతు వచ్చింది. కోయకుండానే కన్నీరు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. భారతీయ మార్కెట్లలో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి.
ఎక్స్‌పోర్ట్ ట్యాక్స్ పెంపుతో దేశంలో ఉల్లి సరఫరా పెరిగితే.. ధరలు అదుపులో ఉంటాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. కేంద్ర నిర్ణయంతో సామాన్యులకు ఊరట కలగనుంది. ప్రభుత్వం ముందు గానే ఊహించి 2023-24 ఆర్ధిక సంవత్సరానికి 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది.
దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి ఉల్లిని తక్కువ ధరకే విక్రయించనున్నారు. రాయితీపై కేవలం రూ.25కే అందిస్తారు. కేంద్రప్రభుత్వం తరఫున ఇప్పటికే టమాటాలను విక్రయిస్తున్న NCCF బఫర్ నిల్వల నుంచి ఉల్లిని సైతం రాయితీపై ప్రజలకు విక్రయించనుంది. బఫర్ లో ఉన్న ఉల్లిని ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా రాయితీలో అందించేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. రెండు రోజులు తర్వాత నాలుగు రాష్ట్రాల్లో విక్రయాలు ప్రారంభించనున్నారు.