Bharat Rice : ఇవాళ్టి నుంచే మార్కెట్లోకి భారత్ రైస్.. ధర ఎంతంటే..?
X
దేశ వ్యాప్తంగా సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.. గత సంవత్సరంతో పోలిస్తే 26 శాతం వరకు బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో పంటనష్టం, వరిసాగు తగ్గి, దిగుబడి తగ్గడం ఒక కారణమైతే... మిల్లర్లే ఎక్కువగా కొనుగోలు చేయడం మరో కారణం. ప్రజలు ఎక్కువగా వినియోగించే సన్న రకాలైన బీపీటీ, హెచ్‌ఎంటీ, సోనామసూరి ధరలు సగటున క్వింటాలుకు రూ.1000 నుంచి రూ. 1500 వరకు పెరిగాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందించాలని నిర్ణయం తీసుకుంది.
పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని భారత్ బ్రాండ్ పేరుతో కిలో బియ్యం రూ.29కే అందించనుంది. 5, 10 కిలోల బ్యాగుల్లో ఇవి లభిస్తాయి. ఇవాళ్టి నుంచి భారత్ రైస్ మార్కెట్ లోకి రానుంది. ఢిల్లీలోని కర్తవ్యపథ్లో భారత్ రైస్ విక్రయాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రారంభిస్తారు. ప్రస్తుతం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ కో-ఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్రీయ భండార్ విక్రయ కేంద్రాల్లో భారత్ రైస్ అందుబాటులో ఉంటుంది. ఈ - కామర్స్ సైట్ల ద్వారా కూడా దీనిని కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే కేంద్రం భారత్' బ్రాండ్ పేరుతో పప్పు, గోధుమ పిండిని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కిలో శనగపప్పును కిలో రూ.60, కిలో గోధమ పిండి రూ.27.50కే 'భారత్' బ్రాండ్ అందిస్తోంది.