గుజరాత్ సర్కార్ సంచలన నిర్ణయం.. 60ఏళ్ల తర్వాత మందుకు గ్రీన్ సిగ్నల్..
X
గుజరాత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గిఫ్ట్ సిటీలో మద్యపాన నిషేధాన్ని ఎత్తేసింది. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో మద్యానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మాత్రం యథావిధిగా మద్య నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. అయితే 60 ఏళ్ల తర్వాత మద్య నిషేధం నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేయడం గమనార్హం. గిఫ్ట్ సిటీలో గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానించేందుకు బీజేపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గాంధీనగర్‌లో ఏర్పాటైన గిఫ్ట్ సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో మందు తాగేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.
కాగా 1960లో గుజరాత్ ఏర్పడినప్పటి నుంచి మద్య నిషేధం అమలవుతోంది. మహాత్మ గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా గత 60 ఏళ్లుగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం కొనసాగుతోంది. అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడ్డాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని, నేరాలు పెరుగుతాయని ఆ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.