ముక్కుతో టైపింగ్.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం..
X
అంగవైకల్యం ఉన్నా కూడా కొంతమంది అద్భుతాలు సృష్టిస్తారు. ఆ వైకల్యాన్ని జయించి తామేంటో నిరూపించుకుంటారు. లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉంటే ఏది అడ్డురాదనే విషయాన్ని గుజరాత్కు చెందిన స్మిత్ నిరూపించాడు. అంగవైకల్యాన్ని అధిగమించి ముక్కుతో టైపి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు. ప్రస్తుతం బీకాం చదువుతూ యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న అతడు.. ఎందరో యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో స్మిత్ చాంగెలా అనే యువకుడు నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. అతడు చేయితో టైప్ చేస్తే బాగా నొప్పి వచ్చేది. దీంతో ముక్కుతో టైపింగ్ చేయడం అలవాటు చేసుకున్నాడు. ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని తట్టుకుని ముక్కుతోనే టైప్ చేయడం నేర్చుకున్నాడు. తాజాగా నిమిషానికి 36 పదాలు టైప్ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించాడు.
తనలాంటి దివ్యాంగ యువత సవాళ్లను అధిగమించి అనుకున్నది సాధించాలని స్మిత్ చెబుతున్నాడు. ‘‘ దేశంలో నాలాంటి దివ్యాంగ యువత ఎంత మందో ఉన్నారు. వారు కూడా జీవితంలో ఎక్కడో ఒక చోట ఒత్తిడికి లోనవుతారు. అలా కాకుండా ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలి. వినూత్నంగా ఆలోచించి విజయం సాధించాలి’’ అని స్మిత్ చెప్పారు.