అండమాన్ పోయినా చేసిన పాపం వెంటాడింది.. దేశ చరిత్రలోనే తొలిసారి..
X
‘రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల్లేదు’’ అని సామెత. మాట వినని ఉద్యోగులను ‘శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం,’ అని మరో బెదిరింపు. రామేశ్వరమైనా, శంకరగిరిమాన్యాలైనా, చివరికి అండమాన్ నికోబార్ దీవులైనా సరే.. చేసిన పాపం వెంటాడక తప్పదు! భార్యను చంపేసి పోలీసులకు దొరకకుండా తిరుగుతున్న ఓ హంతకుడు భారత దేశానికి అత్యంత మారుమూల ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అరెస్టయ్యాడు. పోలీసులు భారత ప్రధాన భూభాగం దాటి అంతదూరం రావడం అసాధ్యమని, వారికి మస్కా కొట్టానని నిశ్చింతగా బతుకుతున్న నిందితుడు.. తలరాతను తిట్టుకుంటూ తిరిగి హరియాణా వస్తున్నాడు. అండమాన్ మారుమూల ప్రాంతంలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు.
హరియాణాలోని అంబాలకు చెందిన ఏపీ సెల్వన్ భార్య 2007లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. పోలీసులు సెల్వన్‌పై అనుమానంతో అరెస్టు చేశారు. అయితే సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు అతనికి బెయిల్ ఇచ్చింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేస్తుడంగా హత్యలో సెల్వన్ పాత్ర ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. 2012లో వాటిని కోర్టుకు సమర్పించగా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే సెల్వన్ అప్పటికే పరారయ్యాడు. 11 ఏళ్లుగా దేశమంతా జల్లెడ పట్టినా దొరకలేదు. సెల్వన్ బంధుమిత్రులపై నిఘా పెట్టడంతో అతని కేసు వివరాలను పలు రాష్ట్రాలకు పంపిన హరియాణా పోలీసులకు ఇటీవల ఆచూకీ లభించింది. అండమాన్ పోలీసులకు విషయం చెప్పడంతో వారు నికోబార్ దీవుల్లో ఒకటైన ‘క్యాంప్‌బెల్ బే’లో తలదాచుకుంటున్న సెల్వన్‌ను అరెస్ట్ చేశారు. దేశ దక్షిణాది చిట్టచివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఈ బేలోనే ఉంది. సెల్వన్ ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్ జైల్లో ఉన్నాడని, అతి త్వరలోనే రప్పించి కోర్టుకు హాజరుపరుస్తామని హరియాణా పోలీసులు చెప్పారు.