HDFC Bank : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు బూస్ట్.. 6 బ్యాంకుల్లో షేర్ల కొనుగోలుకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్
X
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు బ్యాంకుల్లో వాటాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇండస్ ఇండ్, ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఐసీఐసీఐ , సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంకుల్లో 9.50 శాతం షేర్లు కొనుగోలు చేసుకోవచ్చని చెప్పింది. అయితే ఈ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో ఈ ఉత్తర్వులు రద్దవుతాయని తేల్చిచెప్పింది. ఆర్బీఐ పర్మిషన్ లభించిన నేపథ్యంలో ఈ ప్రక్రియకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, సెబీ, ఫెమా అనుమతులు లభించాల్సి ఉంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ గ్రూపునకు చెందిన కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ఆర్బీఐ పర్మిషన్ ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎర్గో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్స్యూరెన్స్లలో షేర్ల కొనుగోలుకు అంగీకరించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్లో చెప్పింది. ఇదిలా ఉంటే ఇండస్ ఇండ్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి ఏ సమయంలోనూ 9.50 శాతం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్ లేదా ఓటింగ్ హక్కులకు సమానమైన వాటా మించి ఉండకూడదని ఆర్‌బీఐ కండీషన్ విధించింది. ఒకవేళ కంపెనీ వాటా 5 శాతం కన్నా తగ్గినా దాన్ని మళ్లీ పెంచుకోవడానికీ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు తమ సంస్థలోనూ 9.5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చినట్లు ఎస్ బ్యాంక్ వెల్లడించింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ప్రమోటర్లు ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్, ఇండస్ఇండ్ లిమిటెడ్‌కు కలిపి 16.45 శాతం, మ్యూచువల్ ఫండ్లకు 15.63 శాతం షేర్లు ఉన్నాయి. ఎల్‌ఐసీ సహా ఇతర బీమా సంస్థలకు 7.04 శాతం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు 38.24 శాతం షేర్లు ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఎస్ బ్యాంక్‌లో 100 శాతం షేర్లు పబ్లిక్ చేతిలోనే ఉన్నాయి. దీంట్లో ఎల్‌ఐసీ 4.34 శాతం, ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్టియానికి 37.23 శాతం వాటాలున్నాయి. వీటితో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌లో 3.43 శాతం, యాక్సిస్ బ్యాంక్‌లో 2.57 శాతం వాటాలు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకి ఉన్నాయి.