Home > జాతీయం > ఆర్తనాదాలు.. మోగుతున్న సెల్ఫోన్లు.. ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు

ఆర్తనాదాలు.. మోగుతున్న సెల్ఫోన్లు.. ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు

ఆర్తనాదాలు.. మోగుతున్న సెల్ఫోన్లు.. ఘటనాస్థలిలో హృదయవిదారక దృశ్యాలు
X

కనీవినీ ఎరుగని విషాదం.. రైల్వే చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదం. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. వందలాది మందిని పొట్టనబెట్టుకుంది. మరికొన్ని వందల మందిని తీవ్ర గాయలపాలు చేసింది. బోగీల్లో చిక్కుకున్న శవాలు.. చెల్లాచెదురుగా పడ్డ మృతదేహాలు.. పట్టాలపై రక్తపుటేరులు. గాయపడినవారి ఆర్తనాదాలు. ఘటనా స్థలంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.

పెరుగుతున్న మృతులు

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సినిమా సీన్ ను తలపించేలా రైలు బోగీలు గాల్లోకి ఎగిరిపడ్డాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలాసోర్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 280 మంది మృతి చెందారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదంలో దాదాపు 900 మంది గాయాలపాలవగా వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మార్చురీగా మారిన స్కూల్

ప్రమాదం జరిగిన చోట ఎటు చూసినా శవాలే కనిపిస్తున్నాయి. రైల్వే ట్రాక్ ల పక్కన పదుల సంఖ్యలో మృతదేహాలు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో అధికారులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను మార్చురీగా మార్చారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఉన్న బహనగా గవర్నమెంట్ స్కూల్ లో మృతదేహాలను భద్రపరిచారు. ఆ శవాల్లో తమ వారెవరైనా ఉన్నారేమో తెలుసుకునేందుకు జనాలు ఆ స్కూల్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే చాలా వరకు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉండటంతో తమ వారిని గుర్తుపట్టలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.

మృతుల వ‌ద్ద మోగుతున్న మొబైల్స్..

ప్రమాదంలో చనిపోయిన వారిలో చాలా మృత‌దేహాల వ‌ద్ద మొబైల్స్ ఫోన్స్ మోగుతూనే ఉన్నాయి. కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్ర‌యాణిస్తున్న త‌మ వారు క్షేమ సమాచారం కోసం వారి కుటుంబసభ్యులు బంధువులు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఫోన్లు ఎత్తక తమ వారి గురించి సమాచారం తెలియక మృతుల సంబంధీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు ఇలాంటి కొన్ని ఫోన్ కాల్స్ వల్ల అధికారులు మృతదేహాలను గుర్తించడం సులభమైంది. సహాయకచర్యలు చేపడుతున్న వారిలో కొందరు ఫోన్లు లిఫ్ట్ చేసి వివరాలు కనుక్కోవడంతో మృతుల సమాచారం వారి బంధువులకు అందించడం సాధ్యమైంది.


Updated : 3 Jun 2023 6:02 PM IST
Tags:    
Next Story
Share it
Top