Nallamala Forest : నల్లమలలో భారీ అగ్ని ప్రమాదం..50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ దగ్ధం
X
(Nallamala Forest) నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో కార్చిచ్చు రాజుకుంది. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్ల పెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో దాదాపు 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మంటలు వ్యాపించకుండా తగిన చర్యలు చేపట్టారు ఫారెస్ట్ అధికారులు.
ఈ అనుకోని అగ్నిప్రమాదంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులకు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వారికి సూచించారు. అడవీ ప్రాంతంలోని జంతువులకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వాటికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకొవాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలోని అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.