తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
X
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, ఒడిశా సహా దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాఖండ్ లోని ఏడు జిల్లాలు డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్, హరిద్వార్ కు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేసింది. ఈ ఏడు జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు జులై 24వ తేదీ వరకూ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో జులై 22 వరకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజుల్లో మహారాష్ట్రలో, మరో మూడు రోజుల్లో గుజరాత్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదిలా ఉండగా.. దక్షిణ ప్రాంతంలోని కేరళ, కర్ణాటక, తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ లో జులై 22 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కేరళలో కొన్ని జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేసింది.