Home > జాతీయం > వర్ష బీభత్సంతో వణుకుతున్న ఉత్తరాది

వర్ష బీభత్సంతో వణుకుతున్న ఉత్తరాది

వర్ష బీభత్సంతో వణుకుతున్న ఉత్తరాది
X

ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. మూడో రోజూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో ఆకస్మిక వరదలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరదల ప్రభావంతో రహదారులతో పాటు వాహనాలు కొట్టుకుపోయాయి. పంటపొలాలు వరుణుడి ప్రతాపంతా చెల్లాచెదురయ్యాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లు నీటమునిగాయి. వర్షాల ప్రభావం హిమాచల్‌ ప్రదేశ్‌పైనే అధికంగా ఉంది. ఓ ఇళ్లు కూలి, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు. అటు పంజాబ్, హరియాణాల్లో 9 మంది, రాజస్తాన్‌లో ఏడుగురు, యూపీలో ముగ్గురు మరణించారు. దీంతో ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ఇప్పటివరకు 37 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. హిమాచల్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 200 మంది పర్యాటకులు వరదల్లో చిక్కుకుపోయారు.





భారీ వర్షాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు వచ్చి చేరింది. ఉత్తరాదిలో ఉన్న తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ కూడా సోమవారం సీనియర్‌ మంత్రులు, అధికారులతో చర్చించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్థానిక యంత్రాంగాలతో కలిసి సంయుక్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరినట్లు పీఎంవో తెలిపింది.





ఇప్పటికే ప్రధాని మోదీ హిమాచల్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆపత్కాల సమయంలో అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఓ వైపు వరదలు మరో వైపు కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్‌ప్రదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అదే విధంగా సిమ్లా–కాల్కా హైవేలో వర్షాలకు కొంతభాగం కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అంతే కాదు పట్టాలపైన కొండ చరియలు విరిగి పడటంతో రైళ్ల రాకపోకలను అంతరాయం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఉత్తరాధిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది.



















Updated : 11 July 2023 5:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top