ఉత్తరాదిని వణికిస్తున్న వానలు.. హిమాచల్‌లో ఐదుగురు...
X
భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్ధమైంది. దేశ రాజధానిలో 40 ఏళ్ల తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153మీ.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాలని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుండపోత వర్షానికి ఢిల్లీ వీధులన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కులు, అండర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిటల్ ప్రాంగణాలు, మాల్స్ సహా వాణిజ్య సంస్ధల ప్రాంగణాలు నీటమునిగాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో వరద బీభత్సం
హిమాచల్ ప్రదేశ్‌లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో గడిచిన 24 గంటల్లో ఐదుగురు మరణించారు. సిమ్లాలో ముగ్గురు, చంబా, కులు ప్రాంతాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన నదులు ఉప్పొంగాయి. బియాస్, రావి నదులు మహోగ్రరూపాన్ని దాల్చాయి. భారీ వరదలు పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ధాటికి ఇళ్లు సహా పలు వాహనాలు కొట్టుకపోయాయి.
Beas River on rampage , massive destruction in its path
— Weatherman Shubham (@shubhamtorres09) July 9, 2023
Visuals from Bahang in Manali of Himachal Pradesh pic.twitter.com/zuiKp5x7Sy
చండీగఢ్‌లో రికార్డ్ వర్షపాతం
చండీగఢ్‌లో భారీ వర్షపాతం నమోదైంది. నిన్నటి నుంచి ఈ ఉదయం 8:30 గంటల వరకు 322 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో రికార్డ్ స్థాయి వర్షం కురిసిందని చెప్పింది. ఇప్పటివరకు చండీగఢ్‌లో 300 మిల్లీమీటర్లకు మించిన వర్షపాతం ఎప్పుడు నమోదు కాలేదు. లోతట్టు ప్రాంతాన్నీ జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.