Ayodhya : అయోధ్యలో 12 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
X
రేపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం ప్రాణ ప్రతిష్ట సందర్బంగా శాంతి భద్రతలపై పోలీసులు నిఘా పెంచారు. మొత్తం 12 వేల మంది పోలీసులు పహారాకు సిద్దమయ్యారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల నుంచి కేంద్ర బలగాలు, పోలీసులు, ఉత్తరప్రదేశ్‌కు చేరుకుంటున్నారు. సిటీ మొత్తం10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రామమందిరం ఆవరణలోనే 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఎల్లో జోన్లో మొదటిసారిగా ఫేషియల్ రికగ్నిషన్ కోసం ఏఐ ఉపయోగిస్తున్నారు. హైలెవెల్ సైబర్ ఎక్స్ పర్ట్ టీమ్ కూడా అయోధ్యకు చేరుకుంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని 22న ఢిల్లీలో మాంసం, చేపలు విక్రయించే వ్యాపారులందరూ తమ దుకాణాలను మూసివేయాలని ఢిల్లీ మీట్ మర్చంట్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో హిందూ సోదర, సోదరీమణుల మనోభావాలను గౌరవిస్తూ మీట్, ఫిష్ విక్రయ కేంద్రాలను మూసివేయడంతో పాటు వధశాలలను కూడా ఆ రోజంతా క్లోజ్ చేయాలని వ్యాపారులను కోరినట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇర్షాద్ ఖురేషీ వివరించారు. అయోధ్య మొత్తం డ్రోన్లతో నిఘా పెట్టారు. అనుమానాస్పద వస్తువులు ఆకాశ మార్గం నుంచి రాకుండా 4.5 కిలోమీటర్ల పరిధిలో డోమ్ ఏర్పాటు చేశారు. అలాగే ఏ పరిస్తితినైనా ఎదుర్కొనేందుకు వాయుసేన కూడా సిద్ధంగా ఉంది. మరోవైపు భద్రతాపరమైన రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. అలాగే భద్రతా చర్యల్లో భాగంగా బార్ కోడింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. యూపీ-నేపాల్ సరిహద్దులోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. వారంపాటు జరిగే ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కలశ పూజ నిర్వహించారు. అయితే, అయోధ్యలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ వేడుకల సందర్భంగా ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటున్నారు.