రాజకీయ సంక్షోభం.. రాజీనామాపై సీఎం క్లారిటీ
X
తాను రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ స్పందించారు. తాను రాజీనామా చేయలేదని చెప్పారు. తనని రాజీనామా చేయమని అధిష్టానం అడగలేదన్నారు. బీజేపీ కావాలనే ఇటువంటి అసత్య పుకార్లు పుట్టిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఐక్యంగా ఉందని.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని స్పష్టం చేశారు. ఇక హిమాచల్కు డీకే శివ కుమార్, భూపేందర్ సింగ్ హుడా వెళ్తున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలతో వారు చర్చించనున్నారు.
కాగా హిమాచల్ ప్రదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొంది. రాజ్యసభలో ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడంతో రాజకీయాలు ఒక్కసారిగా మలుపుతిరిగాయి. ఈ నేపథ్యంలో అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. అవసరమైతే సీఎంను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సుఖ్విందర్ సింగ్ రాజీనామా చేశారని వార్తలు వచ్చాయి. అయితే అటువంటిది ఏమిలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చాయి. ఇద్దరి అభ్యర్థులకు 34 ఓట్లు రావడంతో అధికారులు లాటరీ తీశారు. దీంట్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహజన్ విజయం సాధించగా.. అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇవాళ గవర్నర్ను బీజేపీ శాసనసభ పక్ష నేత జయరాం ఠాకూర్ కలిశారు. మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో హిమాచల్ రాజకీయాలు మరిన్ని మలుపులు తీసుకోనున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 40స్థానాల్లో గెలిపొందగా.. బీజేపీ 25, ఇండిపెండెంట్లు 3స్థానాల్లో విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆరుగు ఎమ్మెల్యేలు బీజేపీ అనుకూలంగా ఓటేయడంతో కాంగ్రెస్ సంఖ్యాబలం 34కు పడిపోయింది. ఇండిపెండెంట్లతో కలుపుకుని అటు బీజేపీకి 34మంది సభ్యుల బలం ఉంది. దీంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి.