స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ..హైకోర్టును ఆశ్రయించిన రెబెల్ ఎమ్మెల్యేలు
X
హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటు పడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథానియా వారి ఎమ్మెల్యేల సభ్యత్వాల నుంచి తొలగించి అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ లో గెలిచి బీజేపీకి అనుకూలంగా ఓటు వేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రెబెల్ ఎమ్మెల్యేలు ఆరుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్ లఖన్‌పాల్, చెతన్య శర్మ, దేవిందర్ కుమార్ భుట్టో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. అయితే కాంగ్రెస్, బీజేపీ పార్టీ అభ్యర్థులిద్దరికి సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేసి నిర్ణయించగా బీజేపీ అభ్యర్థి గెలుపొందాడు. ఈ అనర్హత వేటు వలన హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బలం 40 నుండి 34కు పడిపోయింది. ప్రతిపక్ష బీజేపీకి ఇప్పుడు 25 సీట్లు వచ్చాయి.