Home > జాతీయం > వరద బీభత్సం.. దాదాపు రూ.785కోట్ల ఆస్తి నష్టం

వరద బీభత్సం.. దాదాపు రూ.785కోట్ల ఆస్తి నష్టం

వరద బీభత్సం.. దాదాపు రూ.785కోట్ల ఆస్తి నష్టం
X

భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. ఢిల్లీ (Delhi) సహా హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, జమ్ముకశ్మీర్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో కురుస్తున్న కుంభవృష్టికి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. వర్షాల ధాటికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. రూ.785 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు.

3 రోజుల పాటు కుండపోతగా కురిసిన వర్షాల వల్ల సిమ్లా-కల్కా, మనాలి-చండీగఢ్, జాతీయ రహదారులతో సహా 1,239 రోడ్లు మూసుకుపోయాయని అధికారులు తెలిపారు. 679 బస్సులు వరదల్లో చిక్కుకుపోయినట్లు హిమాచల్​ ఆర్టీసీ పేర్కొంది. కొండచరియలు విరిగిపడటం, రోడ్లు కొట్టుకుపోవడం వల్ల సరుకుల రవాణకు ఆటంకం ఏర్పడిందని అధికారులు తెలిపారు. రోడ్డు పునరుద్ధరణ బాధ్యతలను ITBP, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)​కు అప్పగించినట్లు.. వీరికి పోలీసులు, స్థానికులు సహకరిస్తున్నట్లు చెప్పారు. సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సిమ్లాతో సహా చాలా ప్రాంతాల్లో 1,418 నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని.. దానివల్ల తాగునీటి కొరత ఏర్పడిందని వివరించారు. మొబైల్ సేవలకు కూడా అంతరాయం ఏర్పడిందని చెప్పారు. మనాలిలో మొబైల్ నెట్‌వర్క్‌లు వీలైనంత వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు.. హిమాచల్‌లో వర్షానంతర పరిస్థితులపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్​ సింగ్ సుఖు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కులు, లాహౌల్, స్పితి, మండి ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సుఖు వీక్షించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం సంభవించిందని.. కేంద్రం సాయాన్ని కోరుతామని చెప్పారు.



Updated : 12 July 2023 8:48 AM IST
Tags:    
Next Story
Share it
Top