Home > జాతీయం > Ayodhya Ram Mandir History : అయోధ్య రామమందిర ఉద్యమం నాటి కీలక నేతలు వీరే

Ayodhya Ram Mandir History : అయోధ్య రామమందిర ఉద్యమం నాటి కీలక నేతలు వీరే

Ayodhya Ram Mandir History : అయోధ్య రామమందిర ఉద్యమం నాటి కీలక నేతలు వీరే
X

అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో మరికొన్ని గంటల్లో శ్రీరాముడు కొలువుదీరనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ అమృత ఘడియల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. అయితే ఇదేమీ అంత సులువుగా సాధ్యం కాలేదు. దీని వెనుక శతాబ్దాల చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. అయితే వాటన్నింటిని అధిగమించి రాములోరికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరనుంది.రామ జన్మభూమి ఉద్యమం పేరుతో ఎంతో మంది చేసిన కృషి ఫలితమే ఈ ఆలయం. ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించినవారిని.. ఆలయ నిర్మాణం సాకారం కావడంలో ముఖ్యులను ఒక్కసారి గుర్తుచేసుకుందాం.

అయోధ్య రామమందిరం ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీ గురించే. అంతకుముందు ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది అయోధ్యలో రామాలయం కోసం పోరాడుతున్నా.. ఆ అంశాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలిచి జనాల్లోకి చొచ్చుకుపోయేలా చేసింది ఆడ్వాణీయే. 1990లో.. ఒక టొయోటా మినీ ట్రక్కును రథంగా మార్చి గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌ ఆలయం నుంచి అయోధ్యలో రామజన్మభూమి దాకా ఆయన ప్రారంభించిన యాత్రకు పెద్ద ఎత్తున మద్ధతు లభించింది.

అయితే ఈ రథయాత్రకు రూపకర్త మరొకరు ఉన్నారు.. ఆయనే ప్రమోద్‌ మహాజన్‌.. అయోధ్య ఉద్యమంలో భాగంగా ఆడ్వాణీ తొలుత సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేపట్టాలని భావించారు. అయితే, రాముడి రథం లాంటిదాంట్లో యాత్ర చేపడితే బాగుంటుందని, ప్రజల్లోకి బాగా వెళ్తుందని అప్పటి బీజేపీ జనరల్‌ సెక్రటరీగా ఉన్న ప్రమోద్‌ మహాజన్‌ సూచించారు. ఆయన ఇచ్చిన సలహాతోనే ఈ రథయాత్ర సక్సెస్‌ అయింది. ఆడ్వాణీ చేపట్టిన రథయాత్రలో ‘సెకండ్‌-ఇన్‌-కమాండ్‌’గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్‌జోషీ. 1992లో మథురలో.. బాబ్రీమసీదు కూల్చివేతకు కారణమయ్యేలా కరసేవకులను రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

అశోక్‌ సింఘాల్‌: ఈ ముగ్గురు బీజేపీ నేతలతోపాటు విశ్వహిందూ పరిషత్‌ సంఘానికి చెందిన అశోక్‌ సింఘాల్‌ కూడా ఈ రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వందలాది సాధువులు, హిందూ ప్రముఖులతో ‘ధర్మ సదస్సు’ నిర్వహించింది వీహెచ్‌పీ. అక్కడే రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అక్కడే నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ ఉద్యమానికి అశోక్‌ సింఘాల్‌ ప్రధాన రూపకర్తగా మారి ముందుకు నడిపించారు.

ఉమాభారతి: కాషాయ కండువా కప్పుకుని మధ్యప్రదేశ్ సీఎం అయిన తొలి రాజకీయ నాయకురాలు. రెచ్చగొట్టే నినాదాలతో ప్రసంగాలు చేయడంలో దిట్ట. బాబ్రీమసీదు కూల్చివేత సమయంలో ఆమె ఇలాగే తన నినాదాలతో కరసేవకులను రెచ్చగొట్టినట్టు లిబర్హాన్‌ కమిషన్‌ తేల్చింది. ఆమె ఇచ్చిన సంకేతంతోనే మసీదు కూల్చివేత మొదలైందని ఆమెపై దాఖలైన అభియోగపత్రంలో పేర్కొన్నారు.

వినయ్‌ కతియార్‌: రామ మందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజ్‌రంగ్‌ దళ్‌కు తొలి అధ్యక్షుడు.

కల్యాణ్‌ సింగ్‌: బాబ్రీ కూల్చివేత జరిగిన సమయంలో యూపీ సీఎం. 1991 జూన్‌లో ఆయన సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే రామ్‌లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామమందిర నిర్మాణం జరిపించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. 1992లో మసీదు కూల్చివేస్తున్న కరసేవకులపై ఫైరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నిరాకరించారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం అదే.

Updated : 22 Jan 2024 2:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top