Give up ‘Halal’ Meat :హిందువులు హలాల్ మాంసం తినొద్దు.. కేంద్రమంత్రి
X
హిందువులు హలాల్ మాంసం తినే అలవాటు మానేయాలని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ వ్యాఖ్యానించారు. హలాల్ బదులుగా ‘ఝట్కా’ మాంసాన్ని (ఒక్క వేటుతో జంతువును చంపడం) వినియోగించాలని సూచించారు. ఆదివారం బిహార్‌లోని తన పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగూసరాయ్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలోని మద్దతుదారులతో హలాల్ మాంసాన్ని తినడం ద్వారా ఇకపై తమ ధర్మాన్ని పాడుచేయబోమని ప్రతిజ్ఞ కూడా చేయించారు. ‘‘హలాల్ మాంసం మాత్రమే తినాలనే ముస్లింలను నేను ఆరాధిస్తాను. హిందువులు కూడా తమ మత సంప్రదాయాల పరిరక్షణకు అదే కట్టుబాటు చూపించాలి’’ అని గిరిరాజ్ అన్నారు.
హిందువులు జంతువులను వధించే పద్ధతి ఝట్కా అని, వారు ఎల్లప్పుడూ ఝట్కాకు కట్టుబడి ఉండాలన్నారు. హలాల్ మాంసాన్ని తిని తమను తాము భ్రష్టు పట్టించుకోకూడదని అన్నారు. ఇక ఖాళీ దొరికినప్పుడల్లా సాయంత్రం వేళల్లో హిందువులు దేవాలయాలను సందర్శించాలని కోరారు. ఇదిలా ఉండగా.. కొన్ని వారాల క్రితం, గిరిరాజ్‌సింగ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎలాగైతే.. హలాల్ సర్టిఫైడ్ ఉత్తత్తులను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందో అదే పద్ధతిని బీహార్‌లో కూడా అనుసరించాలని పేర్కొన్నారు.