ఆమె సేవలు వెలకట్టలేం..సుప్రీం కోర్టు
X
ఇంట్లో పనులు చేయడం కూడా ఓ లెక్కా? అని గృహిణులను తీసిపారేసే వారికి సుప్రీం కోర్టు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. గృహిణి సేవలను డబ్బు కోణంలో చూడడం తగదని, ఆమె సేవలు వెలకట్టలేవని ధర్మాసనం తెలిపింది. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో సుప్రీం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.
2006లో ఓ మహిళ కారు యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె ప్రయాణించిన కారుకి ఇన్సూరెన్స్ లేకపోవడంతో..తనకు పరిహారం చెల్లించే బాధ్యత కారు ఓనర్ పై పడింది. దీంతో మృతురాలి భర్త, కుమారుడికి రూ. 2.5 లక్షల పరిహారం చెల్లించాలని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఓనర్ ను ఆదేశించింది. అయితే, ఆ పరిహారం సరిపోదంటూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఆ కేసును వాదించిన కోర్టు వారి పిటిషన్ ను కొట్టివేసింది. ఆమె గృహిణి కాబట్టి పరిహారం ఫిక్స్‌డ్‌గా ఉంటుందని, ఆ నష్టపరిహారం సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే హైకోర్టు తీర్పును బాధిత కుటుంబం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం హైకోర్టు తీర్పును ఎండగట్టింది. గృహిణి ఆదాయాన్ని రోజుకూలి కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. హైకోర్టు వ్యాఖ్యాలను తప్పుబడుతూ..గృహిణి సేవలకు విలువ కట్టలేమని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబానికి ఆరు వారాల్లోగా ఆరున్నర లక్షల పరిహారం చెల్లించాలని కారు ఓనర్ ని ఆదేశించింది. ఉద్యోగం చేసే వ్యక్తి పాత్ర ఎంతో, ఇంటి పనులను చక్కదిద్దే గృహిణి పాత్ర కూడా అంతేనని, వారి విలువను తక్కువగా అంచనా వేయొద్దని సుప్రీం కోర్టు సూచించింది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.