వేరే కులం వ్యక్తిని ప్రేమించిన చెల్లి.. బ్రదర్స్ వెంటాడి పట్టుకుని...
X
ఆధునిక యుగంలోనూ పరువు హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ యువతి వేరే కులం వ్యక్తిని ప్రేమించగా.. ఆమె సోదరులు దారుణంగా చంపేశారు. భయంతో వేరే చోట దాక్కున్నా.. వెంటాడి మరీ క్రూరంగా దాడి చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.
సోయగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో మాయత్ చంద్రకళ అనే యువతి వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇంట్లో చెప్పగా.. కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమ విషయం గురించి మర్చిపోవాలని సూచించారు. అయితే, సదరు యువతి తాను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కుదరదని చెప్పి.. ఇంట్లోని నుంచి వెళ్లిపోయింది.
తాను ప్రేమించిన వ్యక్తితో కలిసి అతని ఇంట్లోనే సహజీవనం చేస్తోంది. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. యువతి సోదరులు ఆగ్రహంతో ఆమెను చంపెందుకు గొడ్డళ్లతో ఆమె ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న యువతి.. ఒకవ్యక్తి సాయంతో మేకల కొట్టంలో దాక్కుంది. అయినా వదలకుండా ఆమె కోసం వెతికారు. చివరకు మేకల కొట్టంలో ఉన్న యువతిపై గొడ్డళ్లతో దారుణంగ దాడి చేశారు. ఈ దాడిలో సదరు యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.