Home > జాతీయం > సబ్బుల మీద జారిపోయిన 220 టన్నుల హోటల్

సబ్బుల మీద జారిపోయిన 220 టన్నుల హోటల్

సబ్బుల మీద జారిపోయిన 220 టన్నుల హోటల్
X

కుక్కపిల్లా.. సబ్బుబిళ్ళా.. అగ్గిపుల్లా.. కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటారు. ఓ చోట సబ్బు బిళ్లలు ఏకంగా ఓ పెద్ద భవనాన్నే పక్కకు జరిపాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. కెనడాలోని నోవా స్కోటియాలోని హాలిఫాక్స్ ప్రాంతంలో ఎల్మ్వుడ్ అనే ఒక చారిత్రాత్మక హోటల్ ఉంది. ఈ భవనాన్ని 1826లో కట్టగా.. ఆ తరువాత ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మారింది. తాజాగా ఈ భవనాన్ని సబ్బు బిళ్లల సహాయంతో పక్కకు జరిపారు. 2018లో ఈ హోటల్‌ను కూల్చివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయగా.. ఓ చిన్న ఐడియాతో దానిని కొత్త చోటుకు తరలించారు.

అధికారులు కూల్చేయాలన్న ఈ హోటల్ను గెలాక్సీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసింది. అయితే ఈ భవనాన్ని కూలగొట్టకుండా కొత్త ప్రదేశానికి మార్చే బాధ్యతను ఎస్ రష్టన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. భవనాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చడంలో ఈ సంస్థ ప్రఖ్యాతి గాంచింది. అయితే 220 టన్నుల హోటల్‌ను మార్చడం అంత సులువు కాకపోవడంతో కొత్త ఆలోచనను అమలు చేశారు. భవనాన్ని మార్చడానికి సాంప్రదాయ రోలర్‌లను ఉపయోగించకుండా సబ్బులను ఉపయోగించారు. ఇలా 700 సబ్బులను ఉపయోగించి భవనాన్ని 30 అడుగుల దూరానికి మార్చారు. అక్కడి నుంచి త్వరలోనే కొత్త ప్రదేశానికి మార్చనున్నారు. ఇలా సబ్బులతో ఏకంగా భవనాన్నే కదిలించారు.




Updated : 12 Dec 2023 12:19 PM GMT
Tags:    
Next Story
Share it
Top