మణిపుర్ అమానుష ఘటన.. నిందితుడి ఇంటికి నిప్పు
X
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన మణిపూర్ ఘటనపై.. ప్రజలు ఇంకా ఆగ్రహాంగానే ఉన్నారు. ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి.. ఆపై జరిగిన రాక్షస క్రీడపై సభ్యసమాజం రగిలిపోతోంది. కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ఘటనపై ప్రజాగ్రహం మాత్రం చల్లారడం లేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఇంటికి కొందరు ఆగంతకులు నిప్పు పెట్టారు.
ఆ కుటుంబాన్ని వెలేశారు
ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్ ఇంటిని ఓ గుంపు తగలబెట్టేసింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా.. భద్రతా బలగాలు ఆ ఊరిలో మోహరించాయి. ఈ పరిణామాన్ని ఆ ప్రాంతంలోని మహిళలే వ్యతిరేకించడం గమనార్హం. వాళ్ల ఆస్తుల్ని ధ్వంసం చేయడం వల్ల ఎలాంటిప్రయోజనం ఉండదని.. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటేనే న్యాయం జరుగుతుందని అంటున్నారు.
ముందే జాగ్రత్త పడ్డాడు.. కానీ..
గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు హుయిరేమ్. అయితే అప్పటికే వీడియో వైరల్ కావడంతో భయంతో కుటుంబాన్ని వేరే చోటకి తరలించి.. తాను మాత్రం మరో చోట తలచాచుకున్నాడు. బుధవారం రాత్రి థౌబల్ జిల్లాను జల్లెడ పట్టిన పోలీసులు.. ఎట్టకేలకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురినీ అరెస్ట్ చేసిన పోలీసులు.. మిగతా నిందితులను పట్టకునే పనిలో ఉన్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై మణిపూర్‌కు మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ వీడియోను సుమోటోగా తీసుకున్న మణిపూర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై తౌబాల్ జిల్లాలోని నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్‌లో అపహరణ, సామూహిక అత్యాచారం, హత్య కేసును నమోదు చేశారు.
సమాధానం ఇవ్వనున్న అమిత్ షా
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో పోరాడుతున్న ఒక వర్గానికి చెందిన మహిళలను అవతలి వైపు నుంచి వచ్చిన గుంపు నగ్నంగా ఊరేగించినట్లు వీడియో చూపించింది. ఈ ఘటన ఇంటర్నెట్ నిషేధం ఎత్తివేసిన తర్వాత వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, ఈ వీడియో దేశవ్యాప్తంగా దుమారం రేపింది. కాగా.. మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని నిర్ణయించింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వనున్నారు.