Home > జాతీయం > భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..

భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..

భర్త నల్లగా ఉన్నాడని వేధింపులు.. కోర్టు ఏం చెప్పిందంటే..
X

నల్లగా ఉన్నాడంటూ భర్తను వేధించడమే కాకుండా.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతడిపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యకు కర్ణాటక హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. భర్త(పిటిషనర్​) కోరుకున్న ప్రకారం.. అతడికి ఆమె నుంచి విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. చర్మం నల్లగా ఉందని వేధించడం క్రూరత్వం కిందకే వస్తుందని పేర్కొంటూ సదరు మహిళను మందలించింది.

వివరాల ప్రకారం.. పిటిషనర్​కు 2007లో వివాహం జరగ్గా 2012లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్​ను ఫ్యామిలీ కోర్టు 2017 జనవరి 13న తిరస్కరించడంతో... దీన్ని సవాల్ చేస్తూ అతడు హైకోర్టుకు వెళ్లాడు. వివాహం జరిగినప్పటి నుంచి తన భార్య తనను నల్లగా ఉన్నాడని చెప్పి వేధిస్తోందని పిటిషన్​లో పేర్కొన్నాడు. తన కూతురు కోసం ఇంతకాలం అవన్నీ భరించానని... కానీ, 2011లో తన తల్లి, ఇతర కుటుంబ సభ్యులపై తన భార్య కేసు వేసిందని తెలిపాడు. ఈ కేసు విషయంలో తాను అనేక బాధలు అనుభవించానని చెప్పాడు. 10 రోజులు పోలీస్ స్టేషన్​లో గడిపానని, కోర్టుల చుట్టూ తిరిగానని వివరించాడు.

'నా భార్య వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి రాలేదు. నేను పనిచేసే చోట యజమానికి కూడా ఫిర్యాదు చేసింది. నేను చాలా మానసిక వేదనకు గురయ్యా' అని తన పిటిషన్​లో వివరించాడు. తనకు విడాకులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. అయితే, పిటిషనర్ భార్య అతడిపై రివర్స్ లో ఆరోపణలు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెతో ఓ బిడ్డను కన్నాడని చెప్పింది. తనను ఎప్పుడూ తిట్టేవాడని, ఇంటి నుంచి బయటకు వెళ్లనిచ్చేవాడని కాదని, ఇంటికి ఆలస్యంగా వస్తే తీవ్రంగా తిట్టేవాడని ఆరోపించింది.

అయితే, కోర్టు ఈ ఆరోపణలను పరిగణలోకి తీసుకోలేదు. వీటికి నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు భర్తతో కలిసి ఉంటానని ముందుకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాలుగా ఫిర్యాదును వెనక్కి తీసుకోకపోవడంపైనా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఉండే ఉద్దేశం ఆమెకు లేదని అభిప్రాయపడ్డ హైకోర్టు.. చివరకు పిటిషనర్​కు విడాకులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Updated : 8 Aug 2023 9:15 AM IST
Tags:    
Next Story
Share it
Top