Home > జాతీయం > Widows Remarry, : మళ్లీ పెళ్లి చేసుకుంటే రూ. 2లక్షలు

Widows Remarry, : మళ్లీ పెళ్లి చేసుకుంటే రూ. 2లక్షలు

Widows Remarry, : మళ్లీ పెళ్లి చేసుకుంటే రూ. 2లక్షలు
X

దేశంలో ఇప్పటివరకు పలు ప్రభుత్వాలు... భర్త చనిపోయిన మహిళలకు ఆర్థిక సాయంగా పింఛన్లను ఇస్తున్నాయి. ఒంటరి మహిళల జీవనానికి చేయూతను ఇచ్చేలా తమ వంతు సాయాన్ని ఇస్తున్నాయి. దీని వల్ల కొంతమేర వారికి అర్థిక ప్రయోజనం కలుగుతోంది కానీ.. వారి జీవితాల్లో మాత్రం వెలుగులు నింపలేకపోతున్నాయ్. అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోతున్న మహిళలు.. మిగిలిన జీవితాన్ని ఒంటరిగానే కొనసాగిస్తూ, సమాజంలో అవమానానికి గురవుతూనే బతుకీడుస్తున్నారు. అటువంటి వారందరికీ జార్ఖండ్ ప్రభుత్వం ఓ శుభవార్త తెలిపింది.

తమ రాష్ట్రంలోని వితంతువుల కోసం జార్ఖండ్ ప్రభుత్వం తాజాగా ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే 'విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన'. చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయి వివక్ష గురవుతున్నవారి జీవితాలను బాగుచేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్.. వితంతువుల కోసం బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద భర్త మరణించిన తర్వాత మళ్లీ వివాహం చేసుకోబోయే మహిళలకు 2 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని అందించనున్నారు.

బుధవారం రాంచీలోని తానా భగత్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంపాయ్ సోరేన్.. ఈ పథకాన్ని ప్రారంభించగా.. తొలి విడతగా ఏడుగురు లబ్ధిదారులకు మొత్తం రూ.14 లక్షలను అందజేశారు. మెరుగైన సమాజం కోసమే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

అయితే ఈ పథకానికి కొన్ని నిబంధనలున్నాయ్. లబ్ధిదారుల వయస్సు ఆ ప్రభుత్వ నియమం ప్రకారం పెళ్లి వయస్సు దాటకూడదు. మళ్లీ పెళ్లి చేసుకున్న మహిళలు.. సంవత్సరం లోపే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో తమ చనిపోయిన భర్త డెత్ సర్టిఫికెట్ ను అందజేయాల్సి ఉంటుంది. సంవత్సరం దాటితే ఈ పథకానికి అర్హులు కారు. ఇంకా.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పథకానికి అర్హులు కారు.



Updated : 8 March 2024 12:56 PM IST
Tags:    
Next Story
Share it
Top