బస్సులో మొదట మహిళ ఎక్కితే..అపశకునమట.. ఎక్కడంటే..?
X
విజ్ఞాన యుగంలోని మనిషి మూడనమ్మకాలను వదలడం లేదు. ఇలా చేస్తే మంచి, అలా చేస్తే చెడు అంటూ అవతలివారిపై వివక్ష చూపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థల్లోనూ ఈ తంతు కొనసాగడం గమనార్హం. కొత్తగా వచ్చిన బస్సుల్లో మహిళలు మొదట ఎక్కితే అపశకునమట. దీంతో మహిళలు ఎక్కకుండా ఆపేశారు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. దీనిపై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది.
ఒడిశాలో ఇటీవల నవీన్ పట్నాయక్ సర్కార్ కొత్త బస్సుల్ని తీసుకొచ్చింది. అయితే బారాముండా బస్ స్టాప్లో కొత్త బస్సుల్లో మహిళలను మొదట ఎక్కకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై సామాజిక కార్యకర్త ఘాసిరామ్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన మహిళా కమిషన్.. అది నిజమే అని తేల్చింది. మహిళలు మొదట బస్సు ఎక్కితే.. ఆదాయం సరిగ్గా రాదని కొంతమంది నమ్ముతున్నారని.. అందువల్లే ఈ వివక్షపూరిత ఆచారం పుట్టికొచ్చిందని తెలిపింది.
ఈ క్రమంలో ఒడిశా రవాణాశాఖకు మహిళా కమిషన్ పలు సూచనలు జారీ చేసింది. ‘‘కొత్త బస్సుల్లో మహిళలు మొదట ఎక్కేలా ఆదేశాలు జారీ చేయాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. ఇటువంటి ఫిర్యాదులు గతంలోనూ తమ దృష్టికి వచ్చాయి. బస్సుల్లో మహిళల రిజర్వేషన్ను 50శాతానికి పెంచాలి. ఇక నుంచి మహిళలకు అసౌకర్యం, అభద్రత కలగకుండా తగిన చర్యలు తీసుకుంటాం’’ అని కమిషన్ స్పష్టం చేసింది.