ఢిల్లీలో మరో మూడ్రోజులు వానలు.. ఇంకా ప్రమాదకరస్థాయిలోనే యమున..
X
ఢిల్లీ ప్రజలను వరద ఇంకా వదలడం లేదు. తాజాగా మళ్లీ వానలు మొదలుకావడంతో జనాల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యయాయి. భారీ వర్షం పడుతుండటంతో యమునా నది మళ్లీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. ఆదివారం రాత్రికి నీటి మట్టం తగ్గుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ ప్రకటనతో ఆందోళన మొదలైంది.
ప్రమాదకరంగానే యమున
యమునా నది నీటి మట్టం ప్రస్తుతం ప్రమాదకర స్థాయిని దాటింది. ఆదివారం ఉదయానికి నీటి మట్టం 206.02 మీటర్లుగా ఉంది. 45 ఏళ్లలో తొలిసారి ఇంత భారీస్థాయిలో వర్షపాతం, వరదలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాలు, వరదలకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
జలదిగ్బంధం
వరద కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాగేందుకు గుక్కెడు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వర్షపు నీరు చేరడంతో కొన్ని ప్రాంతాలు చెరువులను తలపించేలా కనిపిస్తున్నాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
ప్రధాని సమీక్ష
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, యూఏఈ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో మాట్లాడారు. ఢిల్లీలో వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.