Home > జాతీయం > పంచాయతీ ఎన్నికల్లో హింస..11 మంది మృతి

పంచాయతీ ఎన్నికల్లో హింస..11 మంది మృతి

పంచాయతీ ఎన్నికల్లో హింస..11 మంది మృతి
X

పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో 11 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకావాలు కనిపిస్తున్నాయి. అనేకమంది బుల్లెట్ గాయాలకు గురయ్యారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ సభ్యులు, బిజెపి, లెఫ్ట్, కాంగ్రెస్ మరియు ఐఎస్‌ఎఫ్‌లకు చెందిన ఒక్కొక్కరు, రాజకీయ గుర్తింపు లేని మరో వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది.

శనివారం ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. బ్యాలెట్ బాక్సులో నాలుగు ఓట్లు కూడా పడకముందే నలుగురు టీఎంసీ కార్యకర్తలు దారుణ హత్యకు గురవ్వడంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఒక్కసారిగా రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోయింది. కూచ్‌బెహార్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బ్యాలెట్‌ పత్రాలను దగ్ధం చేశారు. బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. రాణినగర్‌లో టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి పలువురు గాయపడ్డారు. జల్‌పాయ్‌గురిలో ఓ టీఎంసీ అభ్యర్థిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్‌ ఆరోపించింది. ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి.

ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు జారీ చేశారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70వేల మంది రాష్ట్ర పోలీసులు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం 73,887 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.06లక్షల మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.

Updated : 8 July 2023 6:11 PM IST
Tags:    
Next Story
Share it
Top