ఇండియా కూటమి క్షమాపణలు చెప్పాలి: రాజ్‌నాథ్ సింగ్
X
తమిళనాడు సీఎం స్టాలిన కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై ఒక్కో రాజకీయ పార్టీ ఒక్కోలా స్పందిస్తోంది. సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్న 80 శాతం ప్రజల మారణహోమానికి ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారని ఇప్పటికే బీజేపీ ఆరోపించింది. ముంబయి మీటింగ్‌లో ఇండియా కూటమి ఇదే నిర్ణయించిందా అంటూ ఆయన్ను ప్రశ్నించింది. అయితే ఈ విషయంలో మాత్రం తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానని జూనియర్ స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తాజాగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అశోక్ గహ్లోత్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. రాజస్థాన్‌లో జరిగిన పరివర్తన్ యాత్రలో పాల్గొన్నకేంద్రమంత్రి జైసల్మేర్‌లో బీజేపీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
"సనాతన ధర్మంపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏమిటో సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే తెలపడం లేదు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఈ వివాదంపై ఎందుకు స్పందించడం లేదు. సనాతన ధర్మాన్ని అవమానించినందుకు ఇండియా కూటమి సభ్యులు క్షమాపణలు చెప్పాలి. లేకపోతే దేశం వారిని క్షమించదు. సనాతన ధర్మం ఈ ప్రపంచాన్ని ఒక ఫ్యామిలీగా భావిస్తుంది. వసుధైక కుటుంబం అనే మెసేజ్‌ను ఇస్తుంది" అని రాజ్‌నాథ్ తెలిపారు" .