INDIA Bloc's Key Meeting : నేడు ఇండియా కూటమి సమావేశం.. సీట్ల షేరింగ్‌పై చర్చ
X
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేడు నాలుగోసారి సమావేశం కానుంది. ఢిల్లీలోని అశోకా హాటల్ ఈ సమావేశానికి వేదిక కానుంది. ఈ సమావేశంలో కీలక రాష్ట్రాల్లో సీట్ల షేరింగ్‌పై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఐదు(తెలంగాణ, మిజోరాం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్) రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపైనా సమీక్షించనున్నట్టు సమాచారం. ఈ నెల 31లోపు సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని కూటమిలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు జరిగే సమావేశంలో సీట్ల పంపకంపై విస్తృత ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉంది.
కూటమిలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మినహా, సీట్ల పంపకం సమస్య ఎక్కడా పెద్ద అడ్డంకి కాదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ కేవలం 8 సీట్లు మాత్రమే ఆఫర్ చేసిందని, అయితే కాంగ్రెస్ 22 సీట్లు డిమాండ్ చేస్తోందని టాక్ నడుస్తోంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ తమకు సీట్లు సర్దుబాటు చేయాలని కాంగ్రెస్ పోటీ పడుతోంది. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య... బీహార్‌లో ఆర్జేడీ-జేడీయూ, హస్తం పార్టీల సీట్ల పంపకం విషయంలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రెండింటిలోనూ సీట్లు కావాలని ఒత్తిడి చేస్తోంది. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో.. కాంగ్రెస్ రెండు స్థానాల్లో, ఆప్ ఐదు స్థానాల్లో పోటీ చేయాలని ఆప్ కోరుతుండగా, కాంగ్రెస్ కనీసం మూడు స్థానాల్లో పోటీ చేస్తామని కోరుతోంది.
మహారాష్ట్రలో ఎక్కువ సీట్ల కోసం కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. అజిత్ పవార్ విడిపోయిన తర్వాత కూడా శరద్ పవార్‌కి చెందిన ఎన్‌సీపీ తన పాత సీట్లను క్లెయిమ్ చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాల మధ్య లోక్‌సభ సీట్ల పంపకం జరగనుంది. బీజేపీని నిలువరించే వ్యూహంలో భాగంగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఒంటరిగా రంగంలోకి దిగనుంది. కేరళలో బీజేపీ పోటీలో లేనందున కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌లు తలపడనున్నాయి. జార్ఖండ్‌లో కాంగ్రెస్-జేఎంఎం మధ్య సమన్వయంలో ఎలాంటి సవాలు లేదు.
తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. తమకు పొత్తు అవసరం లేదని చెబుతోంది. తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేల పొత్తు ఇప్పటికే ఖరారైంది. గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మాత్రమే నేరుగా బీజేపీకి సవాల్ విసిరే స్థితిలో ఉంది. మొత్తమ్మీద ఈ కూటమిలో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లు రానున్నాయనే ప్రచారం జరుగుతోంది.