Home > జాతీయం > China Trap : డ్రాగన్ ఉచ్చులో చిన్న దేశాలు.. ఇంతకీ డ్రాగన్ ప్లాన్ ఏంటి..?

China Trap : డ్రాగన్ ఉచ్చులో చిన్న దేశాలు.. ఇంతకీ డ్రాగన్ ప్లాన్ ఏంటి..?

China Trap : డ్రాగన్ ఉచ్చులో చిన్న దేశాలు.. ఇంతకీ డ్రాగన్ ప్లాన్ ఏంటి..?
X

మాల్దీవులను బాయ్కాట్ చేసిన మోడీ సర్కారు.. గొప్ప పని చేశామని ప్రచారం చేసుకుంటోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తగిన బుద్ది చెప్పామని జబ్బలు చరుచుకుంటోంది. కానీ భవిష్యత్తులో ఆ చిన్న దేశమే భారత్కు ముప్పుగా పరిణమించే అవకాశముందని ఊహించలేకపోతోంది. మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు భారత్ చుట్టూ ఉన్న చిన్నదేశాలు ఒక్కొక్కటిగా దూరం చేస్తున్నాయి. ఇదే అదునుగా పొరుగు దేశం చైనా వాటన్నింటినీ తనవైపు తిప్పుకునేందుకు సకల ప్రయత్నం చేస్తోంది. ఆర్థిక సాయం పేరుతో ఒక్కో దేశాన్ని గుప్పిట బిగిస్తూ.. భారత్ను అష్టదిగ్బంధనం చేసే కుట్ర పన్నుతోంది. భారత్ భద్రతకు పెను సవాలు విసురుతోంది.

మాల్దీవులు

హిందూ మహాసముద్రంలో చిన్న దీవుల సమూహం మాల్దీవులు. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్కు దగ్గరలో ఉన్న ఆ దేశానికి భారత్‌తోనే అనుబంధం ఎక్కువ. ఆ దేశ పర్యాటకుల్లో సింహ భాగం భారతీయులే. మాల్దీవులకు చెందిన వేలాదిమంది భారత్‌లో ఉపాధి పొందుతున్నారు. 1988లో శ్రీలంకకు చెందిన ఉగ్రవాదులు మాల్దీవులపై దాడి చేసినప్పుడు భారత వాయుసేన వారిని తరిమికొట్టింది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం అప్పటి నుంచి ఇండియా ఫస్ట్‌ విధానం అవలంబిస్తోంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 1200 పగడపు దీవులు కలిగిన మాల్దీవ్స్లో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా భారత్‌ వ్యతిరేక భావజాలాన్ని పెంచి పోషిస్తోంది. చైనా వలలో చిక్కిన అక్కడి ప్రభుత్వం ఇండియా ఔట్ నినాదం అందుకుంది. ఎట్టకేలకూ డ్రాగన్ తన అనుకూల పార్టీని ఎన్నికల్లో గెలిపించుకుంది.

హిందూమహా సముద్రం, అరేబియా సమయంపై ఆధిపత్యం కోసం చైనా పన్నుతున్న కుట్రలు, కుతంత్రాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ పేరుతో భారత్‌ చుట్టూ నౌకాశ్రయాలు ఏర్పాటు చేస్తున్న చైనా.. అత్యవసరమైతే అక్కడి నుంచే తన నౌకాదళాన్ని ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తోంది. మాల్దీవులు చైనాకు దాదాపు బిలియన్ డాలర్లు బాకీ ఉంది. ఆ అప్పు తీర్చుకునే క్రమంలో 2015లో మాల్దీవులు చైనాకు తమ దీవుల్లో ఒకదాన్ని కేవలం రూ. 33 కోట్లకు 50 ఏండ్ల లీజుకు ఇచ్చింది. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్‌కు కూడా బహిరంగంగా మద్దతిచ్చింది. మాల్దీవుల్లోని మరావా అటోల్ ప్రాంతంలో తన సబ్ మెరైనా బేస్ ఏర్పాటుకు డ్రాగన్ స్కెచ్ రెడీ చేస్తోంది.

శ్రీలంక

భారత్కు దక్షిణ దిశలో ఉన్న శ్రీలంక హిందూ మహా సముద్రంలోని మరో కీలక ద్వీప దేశం. శ్రీలంకలో చైనా జనాభా ఎంతగా పెరిగిపోతోందంటే మరో 15-20 ఏండ్లలో ఆ దేశం మొత్తం చైనీయులతో నిండిపోతుందా అన్న అనుమానం కలుగుతోంది. శ్రీలంకలో చైనా ప్రాజెక్టులు చాలానే నడుస్తున్నాయి. దీని వెనుక డ్రాగన్ రాజకీయ వ్యూహం ఉంది. చిన్న దేశాలకు విపరీతంగా అప్పులిచ్చి ఆ తర్వాత వాటికి సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అధికారం లేకుండా చేయడం దాని డ్రాగన్ కు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే చైనా శ్రీలంకకు 2018 నుంచి 500 కోట్ల డాలర్ల వరకు అప్పులు ఇచ్చింది.

తన ప్రయోజనాల కోసం చైనా శ్రీలంకలో రెండో అతిపెద్ద నౌకాశ్రయమైన హంబన్ టోటా నిర్మించింది. ఆ విషయం తెలిసినా పర్మిషన్ ఇచ్చిన అప్పటి అధ్యక్షుడు.. ఆ తర్వాత ఆర్థికంగా గిట్టుబాటుకాక, ఇచ్చిన అప్పు తీర్చలేక హంబన్ టోటా పోర్టును చైనాకు 99 ఏండ్ల లీజుకు రాసిచ్చేశారు. పోర్టుకు సమీపంలోని 15వేల ఎకరాల భూమిని సైతం ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుకు చైనాకు కట్టబెట్టేశారు. హంబన్ టోటా పోర్టులో పాకిస్థాన్ నేవీకి చెందిన తైమూర్‌తో పాటు అత్యంత శక్తిమంతమైన, అధునాతన గూఢచర్య వ్యవస్థ ఉన్న చైనా నౌక యువాన్ వాంగ్ 5 లంగరేసుకునేందుకు శ్రీలంక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. భవిష్యత్తులో ఆ ఓడరేవును చైనా సైన్యానికి కీలకస్థావరంగా ఉపయోగించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

ఇక శ్రీలంకలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆయువుపట్టు లాంటిది కొలంబో పోర్ట్. పశ్చిమాసియా, ఆఫ్రికా, అమెరికా తీరాల నుంచి వచ్చే ఇండియన్ కార్గో షిప్స్కు అక్కడే లంగరేగి సరుకును చిన్న చిన్న నౌకల్లో భారత్ లోని వివిధ నౌకాశ్రయాలకు పంపుతారు. ఇంత కీలకమైన పోర్ట్కు చేరువలో చైనా పోర్ట్ సిటీ ఏర్పాటు చేయడం భారత్ కు మరో మింగుడుపడని అంశం. వాణిజ్య అవసరాల కోసమే పోర్టు సిటీ అని చైనా చెబుతున్నా.. అత్యవసర సమయాల్లో చైనా నేవీ అక్కడ తిష్ఠవేసే ప్రమాదం లేకపోలేదు.

పాకిస్థాన్

ఇండియా చుట్టూ అస్థిరత సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా చైనా పొరుగు దేశం పాకిస్థాన్ను చైనా పావుగా వాడుకుంటోంది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి ఆర్థిక సాయం చేస్తున్నట్లు నటిస్తూ అప్పుల ఊబిలోకి నెట్టింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) నిర్మాణం ఆ దేశాన్ని ఉద్దరిస్తుందని మభ్యపెట్టి, పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాదాపు 300 బిలియ‌న్ డాల‌ర్ల‌కుపైగా రుణాలిచ్చి ఆ దేశాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకుంది. గతంలో భార‌త్‌కు వ్య‌తిరేకంగా పాక్‌కు సైనిక‌, ఆర్థిక సాయం చేస్తూ వ‌చ్చిన డ్రాగన్.. ఇప్పుడు ఆ దేశంలో మిలిట‌రీ పోస్టుల‌ను ఏర్పాటు చేస్తోంది. పాకిస్తాన్‌లో 60 బిలియ‌న్ డాల‌ర్ల అంచ‌నా వ్య‌యంతో ఏర్పాటు చేస్తున్న సీపెక్ (చైనా - పాకిస్తాన్ ఎక‌నామిక్ కారిడార్‌) ర‌క్ష‌ణ కోస‌మని పాక్‌కు సైనిక ద‌ళాల‌ను పంపేందుకు చైనా రెడీ అవుతోంది.

పాకిస్థాన్లో కీలకమైన గ్వాదర్ పోర్టును చైనా తన గుప్పిట్లో పెట్టుకుంది. 1620 బిలియన్ డాలర్ల వ్యయంతో చేపట్టిన ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన నిధులను డ్రాగన్ సమకూర్చింది. పోర్టు కన్స్ట్రషన్ బాధ్యతల్ని సైతం తమ దేశానికే చెందిన చైనా ఓవర్సీస్ పోర్ట్ హోల్డింగ్స్ కంపెనీకి కట్టబెట్టింది. వ్యూహాత్మకంగా ఈ నౌకాశ్రయం చైనాకు అత్యంత కీలకం. హర్ముజ్ జలసంధికి సమీపంలో ఉండటంతో చైనా నావికదళం కార్యకలాపాలు నిర్వహించేందు ఇది అత్యంత అనువైన ప్రదేశం. మరోవైపు కరాచీ డీప్ వాటర్ టెర్మినల్ పోర్టును సైతం చైనాకు చెందిన చైనా హార్బర్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మిస్తోంది. దాదాపు 550 బిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుండగా.. అందులో మెజార్టీ వాటా చైనాదే కావడం గమనార్హం. తాజాగా గ్వాదర్, ఖుజ్దార్, హోషబ్, గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రాంతాల్లో పీఎల్ఏ ఔట్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసేందుకు డ్రాగన్ సిద్ధమైంది. ప‌నిలో పనిగా గ్వాదర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును తన సైనిక అవసరాల కోసం వాడుకునేందుకు అనుమతించాల‌ని పాక్పై ఒత్తిడి తెస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్

ఆఫ్ఘనిస్థాన్ లోనూ డ్రాగన్ కంత్రీ పనులు కొనసాగిస్తోంది. తాలిబన్ల గడ్డపై ఆధిపత్యం కోసం పావులు కదుపుతోంది. అమెరికా బ‌లాలు నిష్క్ర‌మించిన త‌రువాత తాలిబ‌న్ల పాల‌న‌లోకి వెళ్లిపోయిన ఆప్ఘ‌నిస్తాన్‌లోనూ సైనిక స్థావ‌రాల‌ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతోంది. తాలిబన్ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోయినా.. చైనా మాత్రం కాబూల్లో తన ఎంబసీ ఏర్పాటు చేసింది. పశ్చిమాసియా దేశాల మీదుగా ఆఫ్రికా ఖండం వరకు చైనా తలపెట్టిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’ను అఫ్ఘనిస్తాన్‌ మీదుగా నిర్మించేందుకు తాలిబన్లతో ఒప్పందం చేసుకుంది.

ఖనిజ సంపన్న దేశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో అపారమైన రాగి, లిథియం, బంగారం నిల్వలున్నాయి. వాటిపై కన్నేసిన డ్రాగన్ ఆఫ్గాన్లోని పలు మైనింగ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే మాల్దీవులు, శ్రీలంక సహా పలు దేశాలకు అడిగినా అడగకున్నా రుణాలిచ్చి, తిరిగి చెల్లించలేని స్థితికి తెచ్చిన చైనా త్వరలోనే ఆ లిస్టులో ఆఫ్గనిస్థాన్ పేరు చేర్చేందుకు సిద్ధమవుతోంది.

ఇరాన్

ఇరాన్ తీర నగరమైన చాబహార్ పోర్ట్ అభివృద్ధికి భారత్, ఇరాన్ మధ్య 2016లో ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం భారత్ అక్కడ కార్గో టెర్మినల్ డెవలప్ చేస్తోంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్ పోర్ట్ కారిడార్.. INSTCకి ఈ ఓడరేపు అత్యంత కీలకం. భారత్ నుంచి కజకిస్థాన్‌, కిర్గిజ్‌ రిపబ్లిక్‌, తజికిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాలకు సరకు రవాణాకు, అఫ్గానిస్థాన్‌కు పంపే ఆహార ధాన్యాలను ఈ మార్గంలోనే పంపిస్తున్నారు. చాబహార్ వల్ల భారత్ కు మాత్రమే కాదు.. ఇరాన్, రష్యాకు కూడా లాభమే. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి ఉపశమనం పొందడంలో ఇరాన్‌, రష్యాకు ఇది చాలా సహాయపడుతుంది.

INSTC ప్రాజెక్టు కింద భారత్, ఇరాన్, అఫ్గానిస్తాన్, అర్మేనియా, అజర్‌ బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్‌న మీదుగా 7,200 కి.మీ పొడవైన రోడ్డు, రైలు, నౌకా మార్గాలు నిర్మించాల్సి ఉంది. కానీ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయి. దీనికి కారణం భారత్ అని ఇరాన్ ఆరోపింస్తోంది. ఇదే సాకుతో ఇరాన్ 2020లో చాబహార్ రైలు ప్రాజెక్టు నుంచి భారత్ ను తొలగించింది. ఆ తర్వాత మళ్లీ తప్పు దిద్దుకుంది.

చాబహార్ విషయంలో భారత్, ఇరాన్ మధ్య వివాదాలు కొనసాగుతుండగా.. చైనా మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకుపోతోంది. ఇరాన్ ను తనవైపు తిప్పుకునేందుకు నిధుల వరద పారిస్తోంది. 2020లో ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్లో తొలి కాన్సులేట్ ఏర్పాటు చేసిన చైనా.. అనంతరం ఆ దేశంతో 25ఏండ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా చైనా సిల్క్ రూట్లో ఇరాన్ పోర్టులను చేర్చింది. ఆ దేశ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో 400 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది.

ఇటీవల ఇజ్రాయెల్పై హమాస్ దాడుల విషయంలో భారత్ వైఖరి ఇరాన్ను అసంతృప్తికి గురిచేసింది. ప్రధాని మోడీ ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించడంపై ఆ దేశం గుర్రుగా ఉంది. తాను బద్దశత్రువుగా భావించే ఇజ్రాయెల్ కు భారత్ మద్దతు పలకిందన్న అక్కసుతో ఇరాన్ చైనాకు మరింత దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు.

నేపాల్

ఒకప్పుడు భారత్‌ - నేపాల్‌ మధ్య బలమైన దౌత్య సంబంధాలు ఉండేవి. సంస్కృతులపరంగానూ ఇరు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. అయితే దశాబ్దకాలంగా నేపాల్‌ భారత్కు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. మధేసి ప్రజల హక్కుల విషయంలో నేపాల్‌, భారత్‌ నడుమ తలెత్తిన విభేదాలను చైనా తనకు అనుకూలంగా మలచుకుంది. నేపాల్‌కు ఇంటర్నెట్‌ సేవలను అందించడం ద్వారా ఆ దేశానికి మరింత దగ్గరైంది. గతంలో ఇంధన అవసరాలకు నేపాల్‌ ప్రధానంగా భారత్‌పైనే ఆధారపడేది. మధేసీ ఉద్యమం సమయంలో నేపాల్‌ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో చైనా ప్రభుత్వం నేపాల్‌కు ఇంధనాన్ని సరఫరా చేసింది. అలా రెండు దేశాల మధ్య స్నేహం బలపడిన తర్వాత పరిస్థితులు చకచకా మారిపోయాయి. చైనా ‘వన్‌ బెల్ట్‌.. వన్‌ రోడ్డు' ప్రాజెక్టులో నేపాల్‌ భాగస్వామి అయిపోయింది. ఇది అదునుగా డ్రాగన్ నేపాల్‌పై బిలియన్ల డాలర్ల పెట్టుబడుల వల విసిరింది. టిబెట్ రాజధాని లాసా నుండి నేపాల్ బోర్డర్‌లోని ఖాసా వరకూ చైనా- నేపాల్ ఫ్రెండ్షిప్ హైవే పేరుతో రోడ్ వే డెవలప్ చేసింది. దాదాపు 800 కిలోమీటర్ల ఈ రహదారి చైనా, నేపాల్ మధ్య వాణిజ్యానికి కీలకంగా మారింది. చైనా, నేపాల్ సరిహద్దులను కలుపుతూ నిర్మించిన ఈ రోడ్డు భారత్ ఆందోళనలకు కారణమైంది.

భూటాన్

డ్రాగన్ ఎంత ప్రయత్నించినా చాలాకాలం దాని విష కౌగిలికి చిక్కని దేశం భూటాన్. 2007 నుంచి భూటాన్పై వల విసిరేందుకు చైనా చేయని ప్రయత్నమంటూ లేదు. 2007లో భారత్ - భూటాన్ మధ్య కుదిరిన కొత్త స్నేహపూర్వక ఒప్పందం తర్వాత పరిస్థితి మారిపోయింది. కొత్త ఒప్పందం ప్రకారం భూటాన్కు స్వతంత్ర విదేశాంగ విధానం అనుసరించే వెసలుబాటు కలిగింది. ఇదే అదునుగా ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలు పరిష్కరించుకుందామంటూ చైనా, భూటాన్‌కు దగ్గరైంది. భారీగా పెట్టుబడులు పెడతానని ఆశ చూపింది. భూటాన్, చైనా మాటలు నమ్మకపోయినా డ్రాగన్తో దూరాన్ని కాస్త తగ్గించుకుంది.

భారత్లాగే భూటాన్తోనూ చైనాకు సరిహద్దు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతోంది. పక్కలో బల్లెంలా మారిన డ్రాగన్.. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఇటీవల ఈ వివాదాన్ని సెటిల్ చేసుకుందామని, దౌత్య బంధాన్ని పటిష్టం చేసుకుందామంటూ చైనా భూటాన్కు ఆఫర్ ఇచ్చింది. ఇందులో భాగంగా గతేడాది అక్టోబర్లో భూటాన్ విదేశాంగమంత్రి తాండీ దోర్జీ బీజింగ్ వెళ్లి చైనా ఉపాధ్యక్షుడు, విదేశాంగమంత్రిని కలిశారు. ఆ భేటీలో చైనా-భూటాన్ సరిహద్దు వివాదానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 2017 నుంచి కొనసాగుతున్న డోక్లామ్ వివాదానికి ముగింపు పలుకుతూ ఆ ప్రాంతాన్ని భూటాన్కు ఇచ్చేందుకు చైనా అంగీకరించినట్లు సమాచారం. అందుకు బదులుగా ఉత్తర ప్రాంతమైన జుకర్ లుంగ్ వ్యాలీని చైనాకు అప్పగించేందుకు భూటాన్ సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు చైనా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న జకర్లుంగ, మెంచుమా లోయను సైతం చైనాకు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుసమాచారం. చైనా - భూటాన్ మధ్య సరిహద్దు వివాదం సెటిలైతే ఆ రెండు దేశాలు మిత్రులుగా మారడం.. పెట్టుబడుల పేరుతో డ్రాగన్ భూటాన్ను కబళించడం ఖాయం. ఇదే జరిగితే ఇప్పటికే సరిహద్దుల్లో భారత్కు సమస్యలు సృష్టిస్తున్న చైనా.. భూటాన్ను అడ్డుపెట్టుకుని మనపై మరింత ఒత్తిడి పెంచే ఛాన్సుంది.

బంగ్లాదేశ్

చైనా తన భస్మాసుర హస్తాన్ని బంగ్లాదేశ్ మీద కూడా పెట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన సోదర సమానుడనే బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. అటు అటు చైనాతోనే సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. బంగ్లాదేశ్ కు భారీ పెట్టుబడులు, రాయితీల ఆశ చూపి ఆకట్టుకుంటోంది. బంగ్లాదేశ్కు 25 బిలియన్‌ డాలర్ల వడ్డీ లేని రుణం అందించిన చైనా.. చైనా నుంచి దిగుమతయ్యే 5వేల రకాలకుపైగా వస్తువులపై టారిఫ్ ను 97% రద్దు చేసింది.

కోల్‌కతాకు 212 నాటికల్‌ మైళ్ల దూరంలో బంగాళాఖాతం తీరంలోని కాక్స్‌బజార్‌ పోర్ట్ ప్రాంతంలో సబ్ మెరైన్ సెంటర్ నిర్మాణానికి చైనా 120 కోట్ల డాలర్ల సాయంచేసింది.

బంగ్లాదేశ్లో రెండు స్మార్ట్ సిటీల నిర్మాణంలో భారీగా పెట్టుబడులకు చైనా ముందుకొచ్చింది. కెరానీగంజ్లో నిర్మించే వాటర్ ఫ్రంట్ స్మార్ట్ సిటీ, అషూలియాలోని కాంపాక్ట్ టౌన్ షిప్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో డ్రాగన్.. లక్ష కోట్ల టాకాలను ఇన్వెస్ట్ చేస్తోంది. బంగ్లాదేశ్ పోర్ట్ సిటీ నుంచి టూరిస్ట్ హబ్ను అనుసంధానించే రైల్వే లైన్ నిర్మాణానికి చైనా గతేడాది నవంబర్ 11న శంకుస్థాపన చేసింది. 104 కిలోమీటర్ల ఈ రైల్వే లైన్ ప్రాజెక్టును చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్, చైనా రైల్వే గ్రూపు లిమిటెడ్ కలిసి నిర్మించనున్నాయి. రైల్వే లైన్ ప్రాజెక్టు పూర్తైనా.. తమ టెక్నీషియన్లు అక్కడే కొనసాగించేలా నిర్మాణ, నిర్వాహణను తానే చేపట్టేలా డ్రాగన్ ప్లాన్ చేసింది. ఇలా ఒక్కో రంగంలో తలదూర్చుతూ చివరకు బంగ్లాదేశ్ను సైతం అప్పుల ఊబిలోకి లాగి తన గుప్పిట పెట్టుకునేందుకు చైనా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది.

మయన్మార్

మయన్మార్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన చైనా ఆ దేశాన్ని పూర్తిగా పద్మవ్యూహంలో బంధించింది. 1990 నుంచి మయన్మార్ మౌలికరంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న డ్రాగన్.. బర్మాకు అవసరమైన ఆయుధాలన్నింటినీ సరఫరా చేస్తోంది. బంగ్లాదేశ్‌ నుంచి విముక్తి పొందడంలోభారత్‌ కీలక పాత్ర పోషించినా.. మయన్మార్ మాత్రం మన కన్నా చైనాతోనే ఎక్కువ స్నేహంగా మెలుగుతోంది. 2016లో చైనా ఆ దేశానికి రెండు జలాంతర్గాములను అందించింది. 1300 బిలియన్ డాలర్ల వ్యయంతో క్యుకప్యు ప్రాంతంలో పోర్ట్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఇలా డ్రాగన్ ఏ అవకాశాన్ని వదలకుండా.. భారత్ చుట్టూ ఉన్న దేశాలను కబళిస్తూపోతోంది. దేశ రక్షణ వ్యవస్థకు పెను సవాల్ విసురుతోంది. మరి మోడీ సర్కారు ఇప్పటికైనా చిన్న దేశాలతో వ్యవహరిస్తున్న తీరు మార్చుకుంటుందా..? డ్రాగన్ కుయుక్తులకు చెక్ పెడుతుందా..? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.




Updated : 17 Jan 2024 7:35 AM GMT
Tags:    
Next Story
Share it
Top