ఇకపై ఎన్డీఏ వర్సెస్ ఇండియా : రాహుల్
X
వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా నిన్న, ఇవాళ బెంగళూరులో ప్రత్యేక సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరై బీజేపీని మట్టికరిపించే అంశాలపై మంతనాలు జరుపుతున్నాయి. విపక్షాల కూటమికి కొత్తగా ఇండియా అనే పేరును కూడా పెట్టారు. ఈ పేరును రాహుల్ గాంధీ ప్రతిపాదించగా.. మిగితా పార్టీలు ఆమోదించాయి.
ఇకపై తమ పోరాటం ఎన్డీఏ వర్సెస్ ఇండియాగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమ పోరాటం విపక్షం వర్సెస్ బీజేపీ కాదు అని.. తమ పోరాటం దేశం కోసం అని చెప్పారు. బీజేపీ దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తోందని.. కొద్ది మంది చేతుల్లోకి దేశం వెళ్తోందని చెప్పారు. అందుకే ఇండియా అనే పేరును ఖరారు చేశామన్నారు. త్వరలో తమ కార్యాచరణ రూపొందిస్తామన్న రాహుల్.. తమ ఆలోచన విధానం దేశం కోసం పనిచేసే విధానాలను రూపొందిస్తాని చెప్పారు.
పీఎం పదవిపై తమకు ఆసక్తి లేదు
మరోవైపు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీకి ఆసక్తి లేదని చెప్పారు. భారత దేశ ఆత్మ, రాజ్యాంగం, లౌకికవాదం, సాంఘిక న్యాయం, ప్రజాస్వామ్యాలను పరిరక్షించడంపై మాత్రమే తమ పార్టీకి ఆసక్తి ఉందన్నారు. రాష్ట్ర స్థాయిలో తమ మధ్య విభేదాలు ఉన్నాయని.. అవి అధిగమించలేనంత పెద్ద విభేదాలు కావన్నారు. నిరుద్యోగంతో బాధ పడుతున్న యువత కోసం, హక్కుల అణచివేతకు గురవుతున్న పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల కోసం ఆ విభేధాలను వదిలిపెట్టవచ్చునని చెప్పారు.